ఇదేం పద్ధతి..?
● పెంట కుప్పల మధ్య కుళాయిలు ఏర్పాటు ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
జలుమూరు: సాధారణంగా ఒక గ్రామంలో ప్రజలందరికీ అందుబాటులో తాగునీరు ఉండాలంటే ప్రజలకు అవసరమైన చోట కుళాయిలు ఏర్పాటు చేయాలి. కానీ మండలంలోని అల్లాడ గ్రామంలో కూటమి నాయకులు పెంట కుప్పల మధ్య ఎటువంటి ఉపయోగం లేకుండా కుళాయిలను ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఈ గ్రామంలో జల్ జీవన్ మిషన్ పనుల్లో భాగంగా కుళాయిలను ఏర్పాటు చేసి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. కాగా ఇటీవల కూటమి ప్రభుత్వం మండలానికి సంబంధించి తాగునీటి కోసం రూ.14 కోట్లు కేటాయించింది. దీంట్లో అల్లాడ గ్రామానికి సుమారు రూ.8 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే లక్ష్యంగా వారి జిరాయితీ భూముల్లో ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రికి రాత్రి యంత్రాలతో తవ్వకాలు చేపట్టారు. అలాగే పెంట కుప్పల మధ్య ఎటువంటి ఉపయోగం లేనివిధంగా కుళాయిలు ఏర్పాటు చేశారు. ఇళ్లకు దూరంగా నీటిని తీసుకెళ్లలేనివిధంగా కుళాయిలు ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏంటని పంచాయతీ వైఎస్సార్‌సీపీ యూత్ అధ్యక్షుడు సనపల శ్రీనివాసరావు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా కుళాయిల ఏర్పాటుకు సంబంధించి ప్రతీ ఇంటి వద్ద రూ.100ల చొప్పున వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై గ్రామీణ నీటి సరఫరా విభాగం డీఈఈ జల్లు సుదర్శనరావు మాట్లాడుతూ కుళాయిలకు సంబంధించి ఎవరు వసూళ్లు చేసినా చర్యలు తప్పవని, అలాగే గుత్తేదారు మనుషులు వసూళ్లకు పాల్పడినా పరిశీలించి ఆ మొత్తం తిరిగి ఇప్పిస్తామన్నారు. పెంట కుప్పల మధ్య కుళాయిల ఏర్పాటుపై స్పందిస్తూ.. ప్రజలకు పూర్తిస్థాయిలో వినియోగం అయ్యేలా చూస్తామని పేర్కొన్నారు.


