వెన్నుపోటు బాబుకు ప్రజలే బుద్ధి చెప్పాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సొంత మామకే వెన్నుపోటు పొడిచిన సీఎం చంద్రబాబు వంటి వ్యక్తికి ప్రజలకు వెన్నుపోటు పొడవటం పెద్ద లెక్క కాదని వైఎస్సార్ సీపీ కాళింగ కుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు (రామారావు) అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రయివేటు హోటల్‌లో మంగళవారం కాళింగ కుల వైఎస్సార్‌సీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ తల్లికి వందనం పేరుతో పిల్లలకు వెన్నుపోటు.. అన్నదాత సుఖీభవతో రైతులకు వెన్నుపోటు, నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగులకు వెన్నుపోటు, ఉచిత బస్సు ప్రయాణం పేరుతో మహిళలకు వెన్నుపోటు.. ఇలా అన్నివర్గాల ప్రజలందరికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపుమేరకు బుధవారం ప్రతి నియోజకవర్గంలో జరిగే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకి కట్టుబడి మ్యానిఫెస్టోను పవిత్రగ్రంథంలా భావించి ఒక్క హామిని కూడా విస్మరించకుండా 99.9 శాతం సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులు దగాకు గురయ్యారని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క డీఏ కూడా ఇవ్వలేదన్నారు. పీఆర్‌సీ కమిషన్ కూడా వేయకపోవడం అన్యాయమన్నారు.
కేటాయింపులేవీ?
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు అబద్ధపు హామీలతో మరోసారి మోసపోయారని చెప్పారు. ప్రతి గ్రామంలో ఒక వ్యక్తిని పెద్దవాడిని చేయడానికి 3 వేల మందిని మోసగించడం అన్యాయమన్నారు. సంక్షేమ పథకాలకు రూ.83వేల కోట్లు అవసరం కాగా కేవలం రూ.7300 కోట్లు బడ్జెట్ కేటాయింపులు చేయడం అన్యాయమన్నారు. జిల్లాలో శాతియుతంగా నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సనపల నారాయణరావు, బాడాన సునీల్, గురుగుబెల్లి శ్రీనివాసరావు, తమ్మినేని వాసుదేవరావు, గురుగుబెల్లి లక్ష్మణరావు, తమ్మినేని మురళి, బాడాన కృష్ణ, కూన రాజు, తిర్లంగి లోకనాథం, బొడ్డేపల్లి నాగేశ్వరరావు, గురుగుబెల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


