పోలవరం ఎత్తు తగ్గింపుతో ఉత్తరాంధ్రకు నష్టం
టెక్కలి/నందిగాం: ఆంధ్రప్రదేశ్‌కు జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడంతో ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. ఆదివారం వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం సన్నాహక సమావేశంలో వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి రూ.58,312 కోట్లతో 45.72 మీటర్లు ఎత్తుతో, 194.2 టీఎంసీ నీటి సామర్థంతో నిర్మాణం చేయాలని రూపకల్పన చేశారని చెప్పారు. దీని వల్ల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్రలో 7 లక్షల ఎకరాలకు సాగునీరు, 22 లక్షల పరిధిలో తాగునీరు అందించవచ్చని రూపొందించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించేందుకు నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఉండి కూడా అభ్యంతరం చెప్పలేదన్నారు. ఫలితంగా పోలవరం ఎత్తు 41.15 మీటర్లకు తగ్గి 115 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం మాత్రమే కలిగి ఉంటుందని తెలిపారు. ఎత్తు తగ్గడం వల్ల 80 టీఎంసీల నీరు లేకుండా పోవడంతో ఉత్తరాంధ్రకు సాగు, తాగునీరు వచ్చే అవకాశం ఉండదన్నారు. 20 ఏళ్లు అధికారం అనుభవించిన కింజరాపు కుటుంబం ఈ ప్రాంతానికి చేసిన ఒక్క శాశ్వత నిర్మాణం లేకపోగా ఇప్పుడు రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతవాసుల కిడ్నీ కష్టాలు తొలగేలా కిడ్నీ ఆసుపత్రి, మంచినీటీ సరఫరా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేలా మూలపేట పోర్టు మంజూరు చేస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు నత్తనడక నడుస్తున్నాయని మండిపడ్డారు.


