గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

గుట్టురట్టు

May 31 2025 12:52 AM | Updated on May 31 2025 12:52 AM

గుట్ట

గుట్టురట్టు

● టాస్క్‌ఫోర్స్‌ దెబ్బతో..
బెట్టింగ్‌ మాఫియా

శ్రీకాకుళం క్రైమ్‌ : అంతర్జాతీయ, ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లే వీరి ఆదాయ మార్గాలు.. క్రికెట్‌ను బలహీనతగా చేసుకున్న యువతే వీరి పెట్టుబడులు.. మెల్లిగా బెట్టింగ్‌ ఊబిలోకి దింపేసి వారి ద్వారా సులువుగా వచ్చే డబ్బులే వీరి విచ్చలవిడి ఖర్చులకు పచ్చ కార్పెట్లు.. షీటర్లు, రాజకీయ నాయకులతో సమస్యలు.. ఏదైనా సమస్య వస్తే అందరినీ మేనేజ్‌ చేసే చాకచక్యం. ఈ పరిస్థితిలో వీరిని ఎలాగైనా పకడ్బందీగా పట్టుకోవాలనే ఫిర్యాదుదారులు చాలా తెలివిగా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డికి విషయం చేరవేశారు. దీంతో ఎస్పీ ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ బృందాలను రంగంలోకి దింపారు. అంతే.. టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దెబ్బకు జిల్లాను ఎప్పటినుంచో పీడిస్తున్న బెట్టింగ్‌ మాఫియా గుట్టు రట్టు అయ్యింది. ఎట్టకేలకు శ్రీకాకుళం రూరల్‌ మండలం, ఎచ్చెర్ల పోలీసులు కేసును ఛేదించారు. బెట్టింగ్‌ నిర్వహిస్తున్న సూత్రధారులు ఎనిమిది మందిలో ఏడుగురిని రిమాండ్‌కు తరలించారు. వీరిలో ఒక మహిళ కూడా ఉండటం విశేషం. మరో 15 మంది బెట్టింగ్‌ పాల్పడేవారిని ఇదే కేసులో సాక్షులుగా మార్చారు. దీనికి సంబంధించి వివరాలను శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ కె.వి.రమణ, డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద వెల్లడించారు. ఎస్పీ ఇచ్చిన సమాచారంతో ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం ఒప్పంగి, ఎచ్చెర్ల మండలం పొన్నాడ వద్ద దాడులు చేసి కీలక బుకీలను అదుపులోకి తీసుకుని లాఅండ్‌ఆర్డర్‌ పోలీసులకు అప్పజెప్పినట్లు చెప్పారు. దీంతో డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద ఆధ్వర్యంలో రూరల్‌ సీఐ సీహెచ్‌ పైడపునాయుడు, జె.ఆర్‌.పురం సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐలు రాము, సందీప్‌లు తమ సిబ్బందితో విచారణ చేపట్టారు.

ఎలా పట్టుబడ్డారంటే..

విశాఖపట్నం జిల్లా తగరపువలసలో ఉంటున్న జలుమూరు మండలం దరివాడ గ్రామానికి చెందిన దున్న మన్మధరావు, ఎచ్చెర్ల మండలం పొన్నాడకు చెందిన పాకల కిషోర్‌, కర్రి రవితేజ, భైరి ఉపేంద్రలు శుక్రవారం పొన్నాడ గ్రామంలోని హనుమాన్‌ జంక్షన్‌ వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి ఆరు మొబైల్‌ ఫోన్లు, బెట్టింగ్‌ వివరాలుండే రెండు నోట్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూరల్‌ మండలం ఒప్పంగి గ్రామానికి చెందిన మంత్రి ధనుంజయరావు నివాసంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇతనితో పాటు విశాఖపట్నం పోతినమల్లయ్యపాలెంకు చెందిన దయాల శ్రీనివాసరావు, అతని భార్య సంగీత లక్ష్మి క్రికెట్‌ లావాదేవీలను పరిశీలిస్తూ కనిపించారు. వీరితో పాటు బెట్టింగ్‌ నిర్వహిస్తున్న శ్రీకాకుళం ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన రొక్కం స్వాతినాయుడు అలియాస్‌ తనూజ్‌ రాక కోసం చూస్తూనే మరోవైపు లావాదేవీల వివరాలుండే పుస్తకాలను చూస్తున్నారు. వెంటనే పోలీసులు దాడులు జరిపి వారి వద్ద నుంచి ఐదు మొబైల్‌ ఫోన్లను, బెట్టింగ్‌ వివరాలు నమోదు చేసే పుస్తకాలు, రూ.8,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఏడుగురిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు

రూ.8,500 మాత్రమే స్వాధీనం.. మిగతాదంతా ఆన్‌లైన్‌లోనే..

బెట్టింగ్‌ నిర్వహణ ఇలా..

మ్యాచ్‌లు జరిగేటప్పుడు వీరి వద్ద బెట్టింగ్‌ కాసే ఆటగాళ్ల వివరాలను ఓ నోట్‌బుక్‌లో రాసుకుంటారు. బాల్‌ టు బాల్‌, ఓవర్‌ టు ఓవర్‌.. వందకు రెండు రెట్లు, ఒక్కోసారి వందకు నాలుగు రెట్లు.. ఇలా అంతా ఫోన్లలోనే వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా పంపుతుంటారు. వీరి వద్ద లిక్విడ్‌ క్యాష్‌ ఉండేది తక్కువ. అంతా ఆన్‌లైన్‌లోనే లావేదేవీలే. కీలక బుకీలు మంత్రి ధనుంజయ, దుంగ మన్మధ, దయాల శ్రీనివాసరావు, పాకల కిషోర్‌లే ఆర్గనైజింగ్‌ చేస్తుంటారు. డబ్బంతా వివిధ మార్గాల్లో శ్రీనివాసరావు అకౌంట్‌లోకి చేరి అక్కడి నుంచి చివరికి అతని భార్య సంగీత లక్ష్మి అకౌంట్‌లో నిలుస్తుందని అదనపు ఎస్పీ వెల్లడించారు. వీరి ఖాతాలన్నీ ప్రస్తుతం వెరిఫై చేస్తున్నామని, ఎవరెవరు ఎంత పంపింది.. మొత్తంగా ఎంతన్నది విచారణ చేసి చెబుతామన్నారు. మరో వ్యక్తి, కీలక బుకీ రొక్కం తనూజ్‌ పరారీలో ఉన్నట్లు చెప్పారు. కేసుకు సహకరించిన స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని, డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద ఆధ్వర్యంలో చాకచక్యంగా ఛేదించిన సీఐలు పైడపునాయుడు, అవతారం, మిగతా సిబ్బందిని అదనపు ఎస్పీ అభినందించారు.

గుట్టురట్టు 1
1/1

గుట్టురట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement