వ్యవసాయ డిప్లమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
ఆమదాలవలస రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించే వ్యవసాయ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తొగరాం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సీపాన నీలవేణి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 16వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. ఈ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు www.angrau.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సందేహాల నివృత్తికి పట్టణ శివారులో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్న వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల పనివేళల్లో సంప్రదించాలని తెలిపారు. దూర ప్రాంతాల వారు 7702394824 ఫోన్ నంబర్‌కు సంప్రదించాలని ప్రిన్సిపాల్ నీలవేణి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్
స్టాండర్డ్స్‌కు పీహెచ్‌సీలు ఎంపిక
అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలోని 24 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లతో పాటు ఆరు అర్బన్ పీహెచ్‌సీ కేంద్రాలు నేషనల్ క్వాలి టీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్‌కు ఎంపికయ్యాయి. ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సోమవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశమందిరంలో ఆయా ఆస్పత్రుల అధికారులను ఘనంగా సత్కరించారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ అనిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డోల (పీహెచ్‌సీ పోలాకి), ధర్మవరం (పీహెచ్‌సీ పొన్నాడ), తండ్యాంవలస (పీహెచ్‌సీ సింగుపురం), తూలుగు (పీహెచ్‌సీ గార), తిమడాం (పీహెచ్‌సీ సైరిగాం) తదితర ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు కలెక్టర్ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
శ్రీముఖలింగం భూములకు 29న సాగు వేలం
జలుమూరు: శ్రీముఖలింగం భూములకు 29న సాగు వేలం వేయనున్నామని ఈఓ పి.ప్రభాకరరావు సోమవారం తెలిపారు. మొత్తం ఆరు బిట్లుగా విడదీసి వేలంపాట నిర్వహించనున్న ట్లు తెలిపారు. వేలం పాటలో దక్కించుకున్న వారు ఒక ఏడాది మొత్తం ముందుగా చెల్లించాలన్నారు. సాగు కాలం మూడేళ్లకు హక్కులు ఉంటాయని ఆయన తెలిపారు.
ప్రభుత్వాల వైఖరి దుర్మార్గం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): చత్తీస్‌గఢ్ దండకారణ్యంలో 27 మంది మావోయిస్టులను కాల్చి చంపడం, బంధువులకు మృతదేహాలను అప్పగించకపోవడం దారుణమని సిపిఐఎంఎల్ మాజీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఎస్‌కే గౌష్, పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, న్యాయవాది కూకలకుంట్ల రవి, పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమనారాయణ మండిపడ్డారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో ఏపీ ఎన్‌జీఓ హోమ్‌లో వారు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఆర్టికల్ 14,21,19 లను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయన్నారు. మావోయిస్టు లేదా దేశపౌరులు ఎవరైనా తప్పు చేస్తే చట్టప్రకారం శిక్షించాలని, ఒక మనిషిని వేరే మనిషి చంపే హక్కు భారత చట్టాల్లో ఎక్కడా లేదన్నారు. మావోయిస్టులను ఆదివాసీలను చంపడానికి ప్రత్యేక సాయుధ బలగాలను ఆపరేషన్ కగార్ పేరుతో ఏర్పాటు చేయడం రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. అంతర్గత పోరాటంగా ఉన్న కగార్ ఆపరేషన్‌లో చనిపోయిన బంధువులకు అప్పగించకపోవడం న్యాయ సూత్రాలకు కూడా విరుద్ధమన్నారు. ఈ సమావేశంలో పౌర హక్కుల సంఘం తెలంగాణ నాయకులు రేపల్లె రాజా నందం తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ డిప్లమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం


