చీమలమందు తాగి మహిళ ఆత్మహత్య
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు పంచాయతీ ఊడికలపాడు గ్రామానికి చెందిన పినిమింటి లక్ష్మీ(37) చీమల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మీ భర్త రామారావు రోజు మద్యం సేవించి భార్యాపిల్లలతో గొడవ పడేవాడు. ఇంట్లో దాచిపెట్టిన డబ్బులను ఈ నెల 27న తీసుకుపోయి రోజంతా పూటుగా తాగి సాయంత్రం ఇంటికి వచ్చి గొడవకు దిగాడు. మనస్థాపానికి గురైన లక్ష్మీ ఇంట్లో ఉన్న చీమల మందును నీటిలో కలుపుకొని తాగింది. గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుశం రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. లక్ష్మికి కుమార్తె జగదీశ్వరి, కుమారుడు శ్యాం ఉన్నారు.
లారీని ఢీకొట్టిన కారు
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పెదపాడు జాతీయ రహదారి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. కోల్‌కతా నుంచి విశాఖపట్నం వెళ్తున్న లారీ ట్యాంకర్‌ను నరసన్నపేట నుంచి శ్రీకాకుళం వెళ్తున్న కారు అతివేగంతో వచ్చి అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రూరల్ ఎస్సై రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ సైనికుల సమస్యలు పరిష్కరిస్తాం
శ్రీకాకుళం కల్చరల్: మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలంగాణ – ఆంధ్ర సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా అన్నారు. జిల్లాలో బుధవారం పర్యటించిన ఆయన కొత్త రోడ్డు వద్ద ఆర్మీ క్యాంటీన్‌ని సందర్శించారు. మాజీ సైనికులకు, వీర నారీమణులకు ఉపయోగపడేలా ఈ–రిక్షా ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం సింహద్వారం దగ్గర ఉన్న ఎక్స్ సర్వీసు మెన్ కంట్రిబ్యూటరి హెల్త్ స్కీమ్ పోలిక్లినిక్‌ని సందర్శించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాజీ సైనికులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ–ఆంధ్ర సబ్ ఏరియా ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్యామాంజలి మిశ్రా, కల్నల్ విక్రాంత్ పాండే, కల్నల్ ఆర్.ఎన్.ముతల్లిక్, డిస్ట్రిక్ట్ ఎక్స్‌సర్వీస్‌మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి.ఈశ్వరరావు, జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ ఎ.శైలజ, ఇ.సి.ఎచ్.ఎస్. అధికారి, విశ్రాంత లెఫ్ట్‌నెంట్ కల్నల్ బి.చంద్రశేఖర్, శ్రీకాకుళం క్యాంటీన్ మేనేజర్ విశ్రాంత సుబెదార్ మేజర్ పి.గోవిందరావు, విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కృష్ణారావు, శ్రీకాకుళం అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం, ఉపాధ్యక్షుడు వి.సూర్యనారాయణ, జనరల్ సెక్రటరీ పి.మురళీధరరావు తదితరులు పాల్గొన్నారు.
బసవన్నకు నివాళులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: కుల, వర్ణ, లింగ భేదాలను వ్యతిరేకించిన మహాత్మ బసవేశ్వర తత్వాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో బసవన్న జయంతి వేడుకలు నిర్వహించారు. బసవన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బసవన్న 12వ శతాబ్దపు తత్వవేత్తగా సమానత్వాన్ని బోధించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో వెంకటేశ్వరరావు, టూరిజం అధికారి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
చీమలమందు తాగి మహిళ ఆత్మహత్య
చీమలమందు తాగి మహిళ ఆత్మహత్య


