ప్రొటోకాల్ ఉల్లంఘించి అవమానిస్తారా?
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ బల్ల గిరిబాబు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. మున్సిపల్ కమిషనర్ రామారావు ప్రొటోకాల్ ఉల్లంఘించి తనను అవమానించారని చైర్మన్ బల్ల గిరిబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ వాయిదా వేసి వెళ్లిపోయారు. మున్సిపల్ సమావేశం ప్రారంభంలో చైర్మన్ తాగునీటి సమస్యపై ప్రారంభ ఉపన్యాసం చేశారు. అనంతరం బోర్లు, పవర్ బోర్లు ఏర్పాటు అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో చైర్మన్ ఒక్కసారిగా కమిషనర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న 26వ వార్డులో ఇటీవల పవర్ బోరును కమిషనర్, టీడీపీ కౌన్సిలర్ శంకుస్థాపన చేసుకున్నారని, కనీసం తనకు సమాచారం ఇవ్వలేదని, కమిషనరే ప్రొటోకాల్ ఉల్లంఘిస్తే ఇక తానెందుకని మండిపడ్డారు. ఇటీవల ప్రొటోకాల్ పాటించకుండా పలు కార్యక్రమాలు చేపడుతున్నారని, అలాంటప్పుడు 31 మంది కౌన్సిలర్లు, అధికారులతో సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం తమకేం ఉందని, కమిషనర్ ఏకచత్రాధిపతిగా పాలన సాగించుకోవాలంటూ బయటకు వెళ్లిపోయారు. దీంతో వైఎస్సార్‌సీపీ, టీడీపీ కౌన్సిలర్లు కూడా సమావేశం నుంచి వెళ్లిపోయారు.
పలాస–కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ తీరుపై చైర్మన్ ఆగ్రహం
ఏక చత్రాధిపత్యం వహిస్తున్నారంటూ సభ వాయిదా


