
సమావేశానికి హాజరైన పాలక మండలి సభ్యులు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి హంస నావికోత్సవం ఈ నెల 24న ఘనంగా నిర్వహించాలని ఆలయ పాలకమండలి తీర్మానించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం స్థానిక ఆలయంలో ఈఓ వి.హరిసూర్యప్రకాష్ ఆధ్వర్యంలో పాలకమండలి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు ఉత్సవ ఏర్పాట్లపై తమ నిర్ణయాలను తెలియజేశారు. సమావేశంలో పాలకమండలి ఎక్స్‌అఫీషియో మెంబర్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, పాలకమండలి సభ్యులు మండవిల్లి రవి, ఎన్.కోటేశ్వర చౌదరి, లుకలాపు గోవిందరావు, డాక్టర్ సోమేశ్వరరావు, ద్వారపు అనూరా ధ, జె.శ్రీనివాస్, దుక్క గనిరాజు, జోగి మల్లెమ్మ, మైలపల్లి లక్ష్మి తదితరులు, ఆలయ సూపరింటెండెంట్ కృష్ణమాచార్యులు పాల్గొన్నారు.
సమావేశంలో తీర్మానించిన అంశాలివే..
● ఈ నెల 24న సాయంత్రం అరసవల్లి ఇంద్రపుష్కరిణిలో క్షీరాబ్ధి ద్వాదశి (హంసనావికా ఉత్సవం) నాడు గత లోపాలను సరిదిద్దుకుని పక్కాగా ఏర్పాట్లు చేయాలి.
● పుష్కరిణిలో శ్రీవారి ఉత్సవమూర్తులతో ఉన్న హంసవాహనంలోకి ధార్మిక (అర్చకులు) సిబ్బంది మినహాయించి మరెవ్వరికీ అనుమతి ఇవ్వకూడదు.
● పుష్కరిణి చుట్టూ అందమైన విద్యుత్ అలంకరణ, భక్తులకు అన్ని విషయాలు, ఏర్పాట్లు, సౌకర్యాల వివరాలు తెలిసేలా ఫ్లెక్సీలు, సూచిక బోర్డులు ఏర్పాట్లు చేయాలి.
● హంసనావికోత్సవం (తెప్పోత్సవం) నాడు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు గర్భాలయంలో ఆదిత్యుని మూలవిరాట్టుకు పూర్తిగా స్వర్ణాలంకరణతోనే భక్తులకు దర్శనం కలిగేలా చర్యలు చేపట్టాలి.
● స్థానిక ఆలయం ఎదురుగా ఉన్న 12 సెంట్ల నివాస స్థలాన్ని దేవస్థానం నిధులతో కొనుగోలు చేయడానికి ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపించాలని కూడా ట్రస్ట్ బోర్డు సభ్యులు నిర్ణయించారు.