
మాట్లాడుతున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
● విజయవంతం చేయాలని పార్టీ
జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్ పిలుపు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కొన్ని దశాబ్దాలుగా జరగని అభివృద్ధి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వల్లే గత నాలుగున్నరేళ్లలో మన రాష్ట్రంలో సాధ్యమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వై ఏపీ నీడ్స్ జగన్(ఆంధ్రాకు జగనే ఎందుకు కావాలి) కార్యక్రమాన్ని గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. ప్రతి మండలంలో ఒక గ్రామ సచివాలయం చొప్పున కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులంతా కలిసి ప్రారంభిస్తారని చెప్పారు. గడప గడపకూ మన ప్రభుత్వంలో భాగంగా ప్రజల్లోకి వెళ్లి అందరి కంటే ముందు ఏమేం చేశామో, ఏం చేయగలమో తెలియజేశామని.. ఇప్పుడు వై ఏపీ నీడ్స్ జగన్ (ఆంధ్రాకు జగనే ఎందుకు కావాలి) పేరుతో మరోసారి జనంలోకి వెళ్లబోతున్నామని వివరించారు. ఇన్నాళ్లు చేసిన సంక్షేమాన్ని గుర్తుచేస్తూ జగన్‌తోనే ఇవన్నీ సాధ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సచివాలయం పరిధిలో ఏయే లబ్ధిదారులకు ఏయే సంక్షేమ పథకాలు అందాయి.. ఏమేరకు అభివృద్ధి జరిగిందనే విషయాన్ని బోర్డులపై పొందుపరుస్తున్నట్లు చెప్పారు. ఇంకా అర్హులు ఉంటే వెంటనే గుర్తించి సంక్షేమ ఫలాలు అందజేసేలా కృషి చేస్తామన్నారు. వైనాట్ 175 నినాదంతో కార్యక్రమాన్ని చురుగ్గా చేపడుతామన్నారు. దేశంలో జీడీపీ అభివృద్ధి రేటు కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి స్థానం దక్కిందన్నారు. తలసరి ఆదాయంలో 9వ స్థానంలో ఉన్నామన్నారు. ఇప్పటివరకు 4.93 లక్షల ఉద్యోగాలను కల్పించామని వివరించారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో 34 వేలు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని, 22 లక్షల ఇళ్లు నిర్మించి గ్రామాలు నిర్మించామని తెలిపారు. కొత్తగా నాలుగు ఓడరేవులు, 10 ిఫిషింగ్ హార్బర్లు, రెండు విమానాశ్రయాలు, 17 మెడికల్ కాలేజీలు, మూడు ఐటీ సెజ్‌లు నిర్మించామని వివరించారు. సమావేశంలో కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ శిమ్మ రాజశేఖర్, ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కింతలి రమేష్, పార్టీ నాయకులు చింతాడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.