● కూల్చివేతలకే పరిమితం
ఏడాది కిందట అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం చుట్టూ శాశ్వత కట్టడాలను కూల్చేసి వదిలేసింది. సరైన అభివృద్ధి ప్రణాళిక లేకుండా, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండా యుద్ధ ప్రాతిపదికన పలు భవనాలను కూల్చివేసి, రథ సప్తమికి ముందు పాలకులు, అధికారులు హడావుడి చేసి, తర్వాత మౌనం పాటించారు. ఆలయ నిధులతో తాత్కాలిక ఏర్పాట్లు చేసి మూడు రోజుల పండగను జరిపించేసి, ఆ తర్వాత అభివృద్ధి జోలికి పోలేదు. దీంతో భక్తులు, అక్కడున్న వ్యాపారులకు అవస్థలే మిగిలాయి. గత ఏడాది డిసెంబర్‌లో రథసప్తమి వేడుకల ఏర్పాట్లలో భాగంగా ఆలయం వద్ద క్యూలైన్లు, మరుగుదొడ్లు, స్నాన పు గదులు, షాపింగ్ కాంప్లెక్స్, అన్నదానం, అన్న ప్రసాదాల తయారీ, ప్రసాద విక్రయశాల భవనాలతో పాటు వివిధ నిర్మాణాలను కూల్చేశారు.
అంతా ఆర్భాటమే..
అరసవల్లిలో దాతల సాయంతో నిర్మించిన నిర్మాణాలను దాతలకు తెలియకుండానే, సమాచారం ఇవ్వకుండా యుద్ధ ప్రాతిపదికన కూల్చేసి సంబంధిత దాతల్ని ఆవేదనకు గురి చేశారు. పోనీ, తర్వాత ఏమైనా చేశారంటే అదీ లేదు. ఏడాది దాటినా వాటి స్థానంలో ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదు. తాత్కాలిక ఆర్భాటంతో కానిచ్చేశారు. రథసప్తమి పండగ పేరుతో గత ఏడాది మూడు రోజుల పాటు హడావుడి చేసిన కేంద్ర, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు ఆలయానికి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయించలేదు. రాష్ట్ర పండగగా ప్రకటిస్తూ జీఓ జారీ చేసి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం నుంచి ఒక్క పైసా ఇచ్చే పరిస్థితి లేదని లిఖితపూర్వకంగా చెప్పేశారు. పోనీ, రెండో ఏడాదైనా ప్రత్యేకంగా నిధులు తెప్పిస్తున్నారంటే అదీ లేదు. గత ఏడాది కార్పొరేషన్ నిధులతో సోకు చేసినట్టే ఈ సారి కూడా అదే తరహాలో ముందుకెళ్తున్నారు. చిత్తశుద్ధి లేకుండా, ఒక ప్రణాళిక రూపొందించకుండా ఆలయ విస్తరణను ఏడాదిగా గాలికొదిలేసి, కూల్చేసిన నిర్మాణాల చోటనే శాశ్వత భవనాలను నిర్మించేందుకు మళ్లీ దాతల కోసం చేతులు చాస్తున్నారు. దాతల సాయంతో నిర్మించిన భవనాలు కూల్చేసి, మళ్లీ కొత్తగా దాతల సాయం తీసుకుని నిర్మించాలని చూడటం ఏమనాలో పాలకులకే తెలియాలి.
● కూల్చివేతలకే పరిమితం


