టీడీపీ కార్యకర్త చెబితేనే యూరియా
రణస్థలం : లావేరు మండలం గుమ్మడాం రైతు సేవా కేంద్రంలో టీడీపీ కార్యకర్త చెప్పిన వారికే యూరియా అందిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రైతు సేవా కేంద్రంలో పంచాయతీ టీడీపీ కార్యకర్త మజ్జి రామ్మూర్తి సమక్షంలో యూరియా పంపిణీ చేశారని, ఇతర పార్టీల మద్దతుగా ఉన్న రైతులకు ఇవ్వడం లేదని సర్పంచ్ దుర్గాశి ధర్మారావు, ఎంపీటీసీ ప్రతినిధి జగ్గురోతు తవిటినాయుడు, వైఎస్సార్ సీపీ నాయకులు ముప్పిడి శ్రీరాములు, నాగం కనకరాజు వాపోయారు. పరిస్థితి మారకపోతే ఆందోళన తప్పదన్నారు. ఈ విషయమై లావేరు వ్యవసాయాధికారి డి.మహేష్‌నాయుడు వద్ద ప్రస్తావించగా.. గుమ్మడాం పంచాయతీకి 20 టన్నుల యూరియా పంపించామని చెప్పారు. ఉదయం నుంచి టీడీపీ, వైఎస్సార్ సీపీ పెద్దలు ఫోన్లు చేసి ఫిర్యాదులు చేస్తున్నారని, అక్కడ ఉద్యోగులు పని చేయలేకపోతున్నారని తెలిపారు. ఎవరికి వారే రాజకీయం చేస్తున్నారని చెప్పారు.


