ముంచుతున్న మంచు..!
రాలిపోతున్న మామిడి పూత
ఆందోళన చెందుతున్న రైతులు
మెళియాపుట్టి: ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వాతావరణంలో మార్పుల కారణంగా రోజూ కురుస్తున్న పొగమంచు ధాటికి మామిడి పూత మాడిపోతోంది. పొగమంచు రైతులపాలిట శాపంగా మారింది. గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో వరుస వర్షాల కారణంగా భూమిలో తేమశాతం పెరగడమే కాకుండా వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న పొగమంచు దీనికి తోడై మామిడి పూతను దెబ్బ తీస్తోంది. మామిడి పంటకు ప్రతీ ఏడాది ఒక్కో ఎకరాకు రూ.35 నుంచి రూ.40 వేల వరకు ఖర్చుచేసి జంగిల్ క్లియరెన్స్, పూతకు మందుల స్ప్రే చేయడం, చెట్లకు చుట్టూ కందకాలు తవ్వడం వంటివి చేస్తున్నారు. దీంతో పూత నిలబడి పంట ఆశాజనకంగా ఉంటేనే ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. లేకుంటే ఇబ్బందులు తప్పవని రైతులు వాపోతున్నారు. అయితే ఉద్యాన పంటల సీజన్‌లో రైతులకు అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలి. వచ్చిన పూత రాలిపోకుండా.. కొత్తపూత వచ్చేందుకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను వివరించాల్సి ఉంటుంది. అధికారులు మామిడి తోటలను పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు అందిస్తే రైతులకు అనవసర ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది.
రోజూ దట్టంగా మంచు కురుస్తుండడంతో ఇప్పటివరకు వచ్చిన పూత మొత్తం రాలిపోతోంది. గతంలో ఈ సమయానికి మామిడిపూత చాలా ఎక్కువగా వచ్చేది. ప్రస్తుతం పూత తక్కువగా ఉంది. వచ్చిన పూత కూడా మాడిపోతోంది. దీంతో ఈ ఏడాది మామిడి పంట ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నాం.
– గూడ రామారావు,
కేరాసింగి, మెళియాపుట్టి
వాతావరణం కారణంగానే పూత రాలుతోంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పూత రానిచోట అధిక మొత్తంలో ఎరువులు, మందులు వినియోగిస్తే ఖర్చులు పెరగడమే కాకుండా, నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మా సిబ్బంది క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి, సలహాలు సూచనలు ఇస్తున్నారు.
– మంగమ్మ,
ఉద్యానవనశాఖ అధికారి, పాతపట్నం
ఈ ఏడాది పూత రాలిపోతుండడంతో ఆందోళనగా ఉంది. అప్పులు చేసి చేసి తోటలను జాగ్రత్త చేసుకున్నాం. కానీ ఇప్పుడు అదనపు ఖర్చులు తప్పేలా లేవు. ఇలా మంచు కురుస్తూ ఉంటే దిగుబడులు తగ్గిపోతాయి. అధికారులే మాకు అండగా ఉంటూ అధిక దిగుబడులు వచ్చేలా సహకరించాలి.
– జన్ని భాస్కరరావు,
నేలబొంతు, మెళియాపుట్టి
ముంచుతున్న మంచు..!
ముంచుతున్న మంచు..!
ముంచుతున్న మంచు..!
ముంచుతున్న మంచు..!


