ధర్మవరం రూరల్: మండల పరిధిలోని పోతుకుంట గ్రామానికి చెందిన కురువ బ్యాళ్ల వనజ (40) ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. వనజ కొంత కాలంగా కీళ్ల వాతం వ్యాధితో బాధపడుతోంది. వ్యాధి నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి భర్త నారాయణస్వామి ఉన్నాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
కుక్కలు అడ్డు రావడంతో అదుపుతప్పిన బైక్
● వ్యక్తి దుర్మరణం
ఎన్‌పీకుంట: మండల పరిధిలోని బందారుచెట్లపల్లి సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో డేరంగుల రమేష్ (48) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ క్రిష్ణమూర్తి తెలిపిన మేరకు.. ఓడీసీ మండలం డబరువారిపల్లి గ్రామానికి చెందిన రమేష్ బజాజ్ ఫైనాన్స్‌లో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం తన ద్విచక్ర వాహనం పై కదిరి వైపు వెళుతుండగా బందారుచెట్లపల్లి సమీపంలో కుక్కలు అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. ఈ క్రమంలో రమేష్ కింద పడటంతో తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే అతడితడిని 108 వాహనం ద్వారా కదిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుటుంబీకులకు సమాచారం అందించామని, వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
యువకుడి దారుణ హత్య
తాడిపత్రిటౌన్: పాత కక్షల నేపథ్యంలో యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన తాడిపత్రి పట్టణంలోని భగత్‌సింగ్ నగర్‌లో జరిగింది. సీఐ ఆరోహణ రావు తెలిపిన మేరకు.. భగత్ సింగ్ నగర్‌కు చెందిన వన్నూరప్ప, రాముడు, పెద్దిరాజు కుటుంబాల నడుమ చాలా కాలంగా పాత కక్షలు నడుస్తున్నాయి. గతంలో ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆదివారం రాముడు, పెద్దిరాజు కుటుంబ సభ్యులైన శివ, నరేష్, ధనుంజయ, రవి, సోమశేఖర్‌లు వన్నూరప్ప కుటుంబంపై దాడికి దిగారు. వన్నూరప్ప కుమారుడు కుళ్లాయప్ప(25)ను కత్తితో పొడిచారు. ఈ క్రమంలోనే కుప్పకూలిపోయిన అతడిని స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుళ్లాయప్పకు భార్య నీలావతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కరువు జిల్లాగా ప్రకటించాలి
పుట్టపర్తి టౌన్: జిల్లాలోని 32 మండలాలనూ కరువు మండలాలుగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఎం కరువు పరిశీలన జీపు జాత పుట్టపర్తి పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా హనుమాన్ సర్కిల్‌లో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 12 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన పంటలు తీవ్ర కరువు నేపథ్యంలో 2.70 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయన్నారు. సాగైన పంటలు కూడా ఎండిపోయాయన్నారు. రైతుకు ఎకరాకు రూ. 50 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 826 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొందన్నారు. ఉపాధి కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించి రూ.700 కూలీ ఇవ్వాలన్నారు. నిత్యావసరాల ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. 50 ఏళ్లు దాటిన మహిళలందరికీ నెలకు రూ.1,500 ఫింఛన్ ఇస్తామని, వలంటీర్లకు రూ.10 వేల జీతం ఇస్తామని, పేదలకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పి కూటమి నాయకులు మోసం చేశారన్నారు. కొత్త పింఛన్ల దరఖాస్తుల్లో నిబంధనల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో మళ్లీ మోసం చేసి గెలవాలనుకుంటున్నారని, ప్రజలు మేల్కొని తగిన బుద్ధి చెప్పాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 30న కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జీఎల్ నరశింహులు, జంగాలపల్లి పెద్దన్న, బ్యాళ్ల అంజి తదితరులు పాల్గొన్నారు.
మద్యం మత్తులో గొంతు కోసుకున్న యువకుడు
పెనుకొండ రూరల్: మద్యం మత్తులో యువకుడు గొంతు కోసుకున్న ఘటన పట్టణంలోని కమాన్ వీధిలో చోటు చేసుకుంది. వివరాలు.. కమాన్ వీధికి చెందిన మహబూబ్ భాషా వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఇంట్లోని వస్తువులు పగలగొట్టాడు. రూం లోపలికి వెళ్లి గడియ పెట్టుకుని బ్లేడ్‌తో గొంతు, చెయ్యి కోసుకున్నాడు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి మహబూబ్ బాషాను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.


