ధర్మవరం రూరల్: మహిళా రైతు పొలంలో దుండగులు విధ్వంసం సృష్టించారు. రాత్రికి రాత్రే కంది పంటను దున్నేశారు. కూటమి నాయకుల ప్రోద్బలంతోనే దుశ్చర్యకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు.. ధర్మవరం మండలం పోతులనాగేపల్లి సర్వే నంబర్ 103–2లో మహిళా రైతు చంద్రమ్మకు 4.03 ఎకరాల డీ పట్టా భూమి ఉంది. ఈ భూమిలో 20 ఏళ్లుగా ఆమె పంటలు సాగు చేసుకుంటోంది. ఇదే సర్వే నంబర్‌లో మేడాపురం గ్రామానికి చెందిన ఎం. వెంకటలక్ష్మికి 1.50 ఎకరాలకు పట్టా ఇచ్చారని చెబుతున్నా ఆమె 20 ఏళ్లుగా సాగులో లేదు. ఈ భూ వివాదంపై ధర్మవరం ఆర్‌డీఓ కోర్టులో కేసు నడుస్తోంది. ఇటీవల రైతు చంద్రమ్మ భూమిలో కంది పంట సాగు చేసింది. కొందరు కూటమి నాయకుల ఒత్తిళ్లతో రెండు రోజుల క్రితం రెవెన్యూ అధికారులు, పోలీసులు పొలం వద్దకు వెళ్లారు. పొలం వివాదం కోర్టు పరిధిలో ఉందని, అందుకు సంబంధించిన కాగితాలను చంద్రమ్మ వారికి చూపించగా.. ఎవరూ గొడవ పడొద్దని చెప్పి అధికారులు వెళ్లిపోయారు. అయితే అదే రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్‌తో దౌర్జన్యంగా పొలంలోకి చొరబడి కంది పంటను ధ్వంసం చేశారు. ఆదివారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన చంద్రమ్మ విషయాన్ని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. చేతికొచ్చిన పంటను ధ్వంసం చేయడంపై బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విషయంపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపారు.
రాత్రికి రాత్రే కంది పంటను
దున్నేసిన దుండగులు
కూటమి నాయకుల
ప్రోద్బలంతోనేనన్న అనుమానాలు


