కుందుర్పి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన వెంకటంపల్లి–కుందుర్పి మార్గంలో జరిగింది. స్థానిక పోలీసుల వివరాల మేరకు.. రాయదుర్గం మండలం కాశీపురం గ్రామానికి చెందిన చిన్నరాయుడు, నాగరాజు (60)ల సమీప బంధువు కర్ణాటక పోలేపల్లిలో మరణించాడు. ఈ క్రమంలో శనివారం అతని దహన సంస్కారాలకు చిన్నరాయుడు, నాగరాజు హాజరై తిరిగి బైకులో స్వగ్రామానికి పయనమయ్యారు. మార్గమధ్యంలో మండలంలోని వెంకటంపల్లి వద్ద వీరి బైకు, మరో బైకు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో నాగరాజు, చిన్నరాయుడుతో పాటు మరో బైక్‌లోని కుందుర్పికి చెందిన దర్శన్‌కు తీవ్రగాయాలయ్యాయి. బంధువులు మెరుగైన చికిత్స కోసం ముగ్గురినీ జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు. దర్శన్‌కు కాళ్లు విరిగాయి. తలకు తీవ్రగాయాలయ్యాయి. చిన్నరాయుడు సైతం తీవ్ర గాయాలతో అనంతపురంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. మృతుడు నాగరాజుకు భార్య సావిత్రి, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఆటోల దొంగ అరెస్ట్
గార్లదిన్నె: ఆటోల దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపిన మేరకు.. నెల రోజుల క్రితం కల్లూరుకు చెందిన నాగరాజు, దస్తగిరితో పాటు గార్లదిన్నెకు చెందిన ఆంజనేయులు ఆటోలు చోరీకి గురయ్యాయి. ఇంటి వద్ద పార్కింగ్ చేసి ఉండగా అపహరించుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతపురం రూరల్ డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ రాగిరి రామయ్య ఆదేశాల మేరకు టెక్నాలజీ ఆధారంగా చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం ఫజుల పేటకు చెందిన షేక్ ఇలియాజ్ ఆటోలను చోరీ చేసినట్లు గుర్తించారు. గార్లదిన్నె మండలంలోని వివిధ గ్రామాల్లో పార్క్ చేసిన ఆటోలను గమనించి ఎవరూ లేని సమయంలో షేక్ ఇలియాజ్ చోరీ చేసేవాడు. అనంతరం వాటిని ఒక చోట దాచిపెట్టి స్వగ్రామం తరలించేవాడు. అక్కడ అద్దెకు ఇచ్చి డబ్బు సంపాదించేవాడు. ఆదివారం శింగనమల మండలం లోలూరు క్రాస్ వద్ద అనుమానాస్పదంగా ఓ వ్యక్తి ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా బాగోతం బయటపడింది. అతన్ని అరెస్ట్ చేసి మూడు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.
బైకును ఢీకొన్న కారు.. ముగ్గురికి గాయాలు
బెళుగుప్ప: బైకును కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. మండల పరిధిలోని నరసాపురం గేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని యలగలవంక గ్రామానికి చెందిన దంపతులు కవిత, రామకృష్ణలు ఆదివారం తమ కుమారుడు పునీత్ పుట్టిన రోజు కావడంతో నూతన వస్త్రాలు, ఇతరత్రా వస్తువుల కొనుగోలుకు బైకులో కళ్యాణదుర్గం వెళ్లారు. అన్నీ కొనుగోలు చేశాక తిరిగి స్వగ్రామం బయలుదేరారు. మార్గమధ్యంలో నరసాపురం గేటు వద్ద ప్రధాన రహదారిపై అతివేగంగా వెళుతున్న ఓ కారు వీరి బైకును ఢీకొంది. ప్రమాదంలో కవిత, పునీత్‌కు స్వల్ప గాయాలు కాగా, రామకృష్ణకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. హుటాహుటిన కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం అనంతపురం తీసుకెళ్లారు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


