పుట్టపర్తి టౌన్: స్కీం వర్కర్లకు కనీస వేతనం అమలు చేయడంతో పాటు వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1,2,3 తేదీల్లో చేపట్టనున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం పుట్టపర్తిలోని కార్మిక కర్షక భవన్‌లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రాధమ్మ, ప్రధాన కార్యదర్శి సౌభాగ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలలో ఆశావర్కర్లతో విధులకు సంబంధం లేకుండా అధికారులు పనులు చేయిస్తున్నారన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రాంతాలో రికార్డులు కూడా రాస్తున్నారన్నారు. సొంత ఖర్చుతో సామగ్రి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని, లేకుంటే దశలవారీగా ఉద్యమాలు ఉధ్రుతం చేస్తామని హెచ్చరించారు. డిసెంబర్ 1,2,3 తేదీల్లో చేపట్టే చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కోశాధికారి రమాదేవి, గౌరవాధ్యక్షులు సాంబశివ, మంతాజ్, చంద్రకళ, అంజనమ్మ, త్రివేణి, కళావతి తదితరులు పాల్గొన్నారు.
క్రికెట్ ప్రాబబుల్స్‌కు ఎంపిక
అనంతపురం: జిల్లా క్రీడాకారులకు అరుదైన గౌరవం లభించింది. త్వరలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నిర్వహించనున్న స్టేట్ ప్రాబబుల్స్ మ్యాచ్‌లకు జిల్లాకు చెందిన క్రికెటర్లు హనీష్ వీరారెడ్డి, మల్లికార్జున, జయంత్ కృష్ణ, దీపక్ ఎంపికయ్యారు. దీనిపై జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సి. శ్రీనాథ్, సెక్రటరీ శ్రీధర్, అసోసియేషన్ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు, కోచ్‌లు హర్షం వ్యక్తం చేశారు. మ్యాచుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఫైనల్ స్టేట్ టీమ్‌కు ఎంపికై జిల్లాకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.


