‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి

Sep 22 2026 1:36 AM | Updated on Sep 22 2026 1:36 AM

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

ప్రశాంతి నిలయం: ప్రభుత్వం స్థానిక సంస్థల నిర్వహణకు తగు చర్యలు తీసుకుంటోందని, ఈ క్రమంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు. పలువురు జిల్లా స్థాయి అధికారులు నేరుగా సమావేశంలో పాల్గొనగా...మరికొందరు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల అమలులో అన్ని శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. 8వ కలెక్టర్ల సదస్సు నిర్ణయాల అమలుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు పక్కాగా అమలు చేయాలన్నారు. పేదల గృహ నిర్మాణ పనులను ముమ్మరం చేయాలన్నారు.

ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీకి

విస్తృత చేర్పాట్లు..

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లాలోని 1–19 ఏళ్లలోపు పిల్లలందరికీ అల్బెండజోల్‌ మాత్రల పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ తెలిపారు. సోమవారం రెవెన్యూ భవన్‌లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ పోస్టర్లను కలెక్టర్‌ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలోని 5,366 విద్యాసంస్థలకు చెందిన 3.68 లక్షల మంది పిల్లలకు అల్బెండజోల్‌ మాత్రలను అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నులిపురుగులు కడుపులో చేరడం వల్ల రక్తహీనత, ఆకలి మందగించడం, అతిసారం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. అందువల్ల అందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. ఈ మేరకు పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలన్నారు.

ఏరువాక జిల్లా కోఆర్డినేటర్‌గా బాలాజీ నాయక్‌

పుట్టపర్తి అర్బన్‌: ఏరువాక కేంద్రం జిల్లా కోఆర్డినేటర్‌గా బాలాజీనాయక్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రంలో ఏడేళ్ల పాటు విస్తరణ శాస్త్రవేత్తగా సేవలందించిన ఆయన్ను ప్రభుత్వం ఇటీవలే ఏరువాక కేంద్రం జిల్లా కోఆర్డినేటర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ ఇక్కడ పనిచేసిన డాక్టర్‌ కే. రామసుబ్బయ్య ఉదయగిరి వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్‌గా బదిలీపై వెళ్లారు. వ్యవసాయ విస్తరణ రంగంలో విశేష అనుభవం కలిగిన బాలాజీ నాయక్‌ జిల్లా కోఆర్డినేటర్‌గా నియమితులు కావడం వల్ల చాలా మేలు జరుగుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా బాలాజీ నాయక్‌ మాట్లాడుతూ, జిల్లాలోని రైతులకు అధునాతన వ్యవసాయ పద్ధతులు, పంటల సాగులో సలహాలు, సూచనలు అందించి రైతుకు మేలు జరిగేలా కృషి చేస్తానన్నారు.

విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం.. రైతుకు పాము కాటు

రొద్దం: మండల పరిధిలోని నల్లూరు ఎస్సీ కాలనీకి చెందిన రామప్ప కుటుంబం కొంతకాలంగా గ్రామ సమీపాన వ్యవసాయ తోటలో షెడ్డు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటోంది. షెడ్డుకు విద్యుత్‌ సౌకర్యం కోసం ఆరు నెలల క్రితం రామప్ప దరఖాస్తు చేసుకున్నారు. అయితే, విద్యుత్‌ శాఖ అధికారులు సింగిల్‌ ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఇవ్వలేదు. రేపు, ఎల్లుండి అంటూ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం రాత్రి వేళ షెడ్డులోకి పాము చొరబడి రామప్ప కుటుంబ సభ్యుడైన గంగాధర్‌ను కరిచింది. ప్రస్తుతం ఆస్పత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పాముకాటుకు గురికావాల్సి వచ్చిందని బాధిత కుటుంబం వాపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement