ప్రశాంతి నిలయం: ‘‘జిల్లాలోని నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు అనుమతులేకుండానే తరగతులు నిర్వహిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులను పీడించి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆ కార్పొరేట్ స్కూళ్లను కట్టడి చేయండి’’ అని విద్యార్థి సంఘాల నాయకులు జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌ను కోరారు. సోమవారం రెవెన్యూ భవన్‌లో కలెక్టర్ శ్యాంప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి శేషం మహేంద్ర మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న నారాయణ, శ్రీ చైతన్య పాఠశాలలకు ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించేందుకు అనుమతులు లేవన్నారు. వెంటనే సదరు పాఠశాలలను సీజ్ చేయాలన్నారు. సదరు సంస్థలపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా విద్యాశాఖ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదన్నారు.
ప్రతి అర్జీని పరిష్కరించండి..
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. ‘పరిష్కార వేదిక’లో వివిధ సమస్యలపై 333 అర్జీలు అందగా...వాటిని ఆయా శాఖలకు పంపారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అన్ని శాఖల అధికారులు పని చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్‌ఓ కొండయ్య, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు విద్యార్థి సంఘాల నేతల వినతి
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 333 అర్జీలు


