జిల్లాలో ఎక్కడా కూడా తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో సోమవారం ఉదయం ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల ప్రజలు ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలపడంతో...వాటిని నోట్ చేసుకున్న కలెక్టర్..ఆయా ప్రాంతాల్లోని తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మొత్తం 22 ఫిర్యాదులు అందాయని, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. డయల్ యువర్ కలెక్టర్‌లో సమస్యలను తెలియజేయలేక పోయిన వారు కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్ 08555289039కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కొండయ్య, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మూరళీధర్, డీపీఓ సమత తదితరులు పాల్గొన్నారు.


