అనంతపురం అర్బన్: రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కోశాధికారిగా ఆర్‌ఎన్ దివాకర్‌రావు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. విజయవాడలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయనకు రాష్ట్ర కమిటీలో చోటుకల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సీహెచ్ కృష్ణమూర్తిని, దివాకర్‌రావును జిల్లా సంఘం నాయకులు గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా దివాకర్‌రావు మాట్లాడుతూ తనకు ఇంతటి బాధ్యత అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సోమశేఖర్, ఉపాధ్యక్షుడు ముక్తియార్, కోశాధికారి పునీత్‌బాబు, డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు నారాయణస్వామి, రాజ్‌కుమార్, ఆదినారాయణ, సూర్యనారాయణ, చంద్రమోహన్, నాయకులు దినేష్, ఉదయ్‌లు పాల్గొన్నారు.
ఉత్కంఠ పోరులో
వెస్ట్ బెంగాల్ విజయం
అనంతపురం: స్థానిక ఆర్డీటీ క్రీడామైదానంలో ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏపీఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో డాక్టర్ తాలిమెరెన్ ఆవో అండర్–19 బాలికల నేషనల్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన రెండు మ్యాచ్‌లో వెస్ట్‌బెంగాల్, ఒడిశా జట్లు గెలుపొందాయి. ఉదయం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్, వెస్ట్‌బెంగాల్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్‌లో 1–0 గోల్స్ తేడాతో వెస్ట్ బెంగాల్ జట్టు విజయం సాధించింది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన రెండో మ్యాచ్‌లో ఒడిశా, మహారాష్ట్ర జట్లు తలపడ్డాయి. మహారాష్ట్ర జట్టు ఒక గోల్ చేయగా, ఒడిశా జట్టు నాలుగు గోల్స్‌తో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లు తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు అనంత క్రీడాగ్రామానికి చేరుకుంటున్నారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లను ఏపీఎఫ్‌ఏ ప్రతినిధులు జి.అనిల్ కుమార్, సురేష్ మక్కె, సురేష్, జి.పవన్ కుమార్, దాసరి మల్లేష్, ఆర్‌ఎన్ శ్రీనివాస్, ఇర్షాద్ అలీ పరిశీలించారు.
కలప అక్రమ రవాణా వాహనం సీజ్
మడకశిర: పట్టణ సమీపంలో ఆదివారం అక్రమంగా కలపను తరలిస్తున్న వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు సీజ్ చేశారు. రూ.లక్షలు విలువ చేసే కలపను వాహనంలో అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. పావగడ ప్రాంతం నుంచి బెంగళూరుకు కలపను తరలిస్తున్నట్లు తెలిసింది.
గుడిబండలో భారీ అగ్నిప్రమాదం
గుడిబండ: స్థానిక బస్టాండ్ ఆవరణలోని శ్రీలక్ష్మీ హాసన్ అయ్యంగార్ బేకరీలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరి గింది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి బేకరీ పూర్తిగా కాలిపోయింది. రాత్రివేళలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో బేకరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, కాసేపట్లో వ్యాపించాయి. అటుగా వెళుతున్న గణేష్ ఉత్సవ నిర్వాహకులు గమనించి పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అర్థరాత్రి కావడంతో అప్పటికే బేకరీలోని కౌంటర్లు, ఫ్రిజ్‌లు , స్వీట్లు, కూల్‌డ్రింక్స్ పూర్తిగా కాలిపోయాయి.ఈ ప్రమాదంలో దాదాపు రూ.8లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని బేకరీ యజమాని తెలిపాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.


