వ్యక్తి మృతి వివాదాస్పదం | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి మృతి వివాదాస్పదం

Sep 20 2026 6:48 AM | Updated on Sep 20 2026 6:48 AM

పుట్టపర్తి: వ్యక్తి మృతి వివాదాస్పదమైంది. పీహెచ్‌సీలో వేసిన ఇంజక్షన్‌ వికటించడం వల్లే మృతి చెందాడంటూ బంధువులు ఆరోపించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. నల్లమాడ మండలం వంకరకుంట గ్రామానికి చెందిన రాము(42) భార్య నారాయణమ్మతో కలిసి వినాయక చవితికి పుట్టపర్తి మండలం ఎనుములపల్లిలోని బంధువుల ఇంటికి వారం క్రితం వచ్చాడు. శుక్రవారం రాత్రి వినాయక నిమజ్జన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. శనివారం ఉదయం ఒళ్లు నొప్పులు ఉన్నాయంటూ ఇంట్లో ఉన్న మాత్రలు మింగాడు. గంట తర్వాత ఒళ్లంతా దద్దుర్లు రావడంతో కుటుంబీకులు అతడిని ఎనుములపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. రామును పరిశీలించిన డాక్టర్‌ గాయత్రి అతడికి ఇంజక్షన్‌ వేసి కొద్దిసేపు అక్కడే ఉండాలని చెప్పారు. ఈ క్రమంలోనే రాముకు ఫిట్స్‌ రావడంతో డాక్టర్‌ మరో ఇంజక్షన్‌ వేశారు. వెంటనే 108కు సమాచారం ఇచ్చి రామును కొత్తచెరువు సీహెచ్‌సీకి పంపారు. పరీక్షించిన డాక్టర్‌ అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న బంధువులు పీహెచ్‌సీలో వేసిన ఇంజక్షన్‌ వికటించడం వల్లే రాము మృతి చెందాడని ఆరోపించడం చర్చనీయాంశమైంది.

కరెంటు షాక్‌తో కూలీ మృతి

యల్లనూరు: కరెంటు షాక్‌తో కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని తిమ్మంపల్లి వద్ద జరిగింది. ఎస్‌ఐ రామాంజనేయరెడ్డి తెలిపిన మేరకు.. శనివారం తిమ్మంపల్లి సమీపంలోని ఓ వ్యవసాయ తోటలో మోటారును బయటకు తీసే పనులకు బుక్కాపురం గ్రామానికి చెందిన మునీంద్ర (50) వెళ్లాడు. జీపు సాయంతో మోటారును బయటకు తీస్తున్న సమయంలో మునేంద్ర గమనించకుండా పైపులు పైకి ఎత్తడంతో విద్యుత్‌ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మునీంద్రకు భార్య లక్ష్మిదేవి, పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రామాంజనేయరెడ్డి కేసు నమోదు చేశారు.

గడ్డి మందు తాగి

యువతి ఆత్మహత్య

బుక్కరాయసముద్రం: గడ్డి మందు తాగి యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని కొత్తపల్లిలో జరిగింది. పొలీసులు తెలిపిన మేరకు.. కొత్తపల్లికి చెందిన రాజు, జానకి దంపతుల కుమార్తె అశ్వని (19) తన తల్లితో కలిసి నిత్యం కూలి పనులకు వెళ్తుండేది. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న గడ్డి మందు తీసుకుని గ్రామం బయటకు వెళ్లిన ఆమె.. అక్కడ గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయింది. స్థానికులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి పరిశీలించగా, అప్పటికే అశ్వని మృతి చెందింది. అశ్వని ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఉరివేసుకుని మహిళ ..

తాడిపత్రిటౌన్‌: తాడిపత్రి పట్టణంలోని ఇందిరా నగర్‌లో నివాసం ఉంటున్న సునీత (40) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సునీత, విజయ్‌ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు సంతానం. పెద్దమ్మాయి ఇడుపుల పాయ ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్‌ చదువుతోంది. విజయ్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంతకాలంగా సునీత అనారోగ్యంతో బాధపడుతోంది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా నయం కాకపోవడంతో మనోవేదనకు గురైన ఆమె శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

● సునీతకు చికిత్సల నేపథ్యంలో కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయని, దీంతో అప్పుడప్పుడు భార్యాభర్తలు గొడవ పడేవారని స్థానికులు చెబుతున్నారు. అనారోగ్యంతో పాటు కాపురంలో కలహాలతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పేర్కొన్నారు.

ఆంధ్ర జట్టుకు భంగపాటు

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఏపీఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా సాగుతున్న డాక్టర్‌ తాలిమెరెన్‌ ఆవో అండర్‌–19 బాలికల జాతీయ ఫుట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో ఆంధ్ర జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. శనివారం ఉదయం కర్ణాటక, ఏపీ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. కర్ణాటక జట్టు క్రీడాకారులు ఆట ప్రారంభం నుంచి దూకుడు ప్రదర్శిస్తూ వచ్చారు. కర్ణాటక జట్టు 7 గోల్స్‌ సాధించగా, ఏపీ జట్టు ఒక్క గోల్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement