● బినామీ కార్మికులే ఆసరాగా..
● కాంట్రాక్టర్ల ఖజానాకు సొమ్ము
● అసలైన కార్మికులకు దుమ్ము
● నిబంధనలకు పాతర.. దోపిడీకి జాతర
అనంతపురం న్యూటౌన్: శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్టును కాంట్రాక్టర్లు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. వీరికి కొందరు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సహకారం అందించడంతో చెలరేగిపోతున్నారు. నిన్నటి చెక్కు జారీ.. రీ కాల్ చేయడం, మరొకరి పేరుతో అదే మొత్తాన్ని చెక్కు జారీ చేసిన తతంగమే చక్కటి ఉదాహరణ. ఈ మొత్తం వ్యవహారంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఆప్తుడైన మడకశిర ఏరియా ప్రస్తుత కాంట్రాక్టర్ అడపా వెంకటరావుకు లబ్ధి చేకూర్చడానికి అధికారులు తహతహలాడినట్లు స్పష్టమవుతోంది. ఇలాంటి వెలుగుచూడని అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
పీఎఫ్ జమలో చేతివాటం
ఉమ్మడి అనంతపురం జిల్లాలో నీలకంఠాపురం శ్రీరామరెడ్డి వాటర్ ప్రాజెక్టు కింద రాయదుర్గం, కళ్యాణదుర్గం, మడకశిర, హిందూపురం, పీఏబీఆర్ హెడ్ వర్క్‌లో సుమారు 600 మంది కార్మికులు రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. కార్మికులకు వేతనంతో పాటు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) చెల్లించాలని చట్టం ఉన్నప్పటికీ 2021 – 22లో అప్పటి కాంట్రాక్టర్ లక్ష్మీకళ నాయుడు ఐదు నెలల సొమ్ము జమచేయలేదు. అయినా సదరు కాంట్రాక్టర్‌పై ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.
బినామీ కార్మికుల పేరుతో రూ.కోట్ల దోపిడీ
లక్ష్మీ కళానాయుడు కాంట్రాక్టర్‌గా ఉన్న సమయంలో బినామీ కార్మికుల పేరుతో దోపిడీకి తెరలేపారు. వాస్తవానికి మడకశిర ప్రాంతంలోని ప్రాజెక్టులో సుమారు 100 మంది దాకా కార్మికులు పనిచేసేవారు. అయితే కాంట్రాక్టరుకు కలిగిన దుర్బుద్ధితో అక్కడ పనిచేసే కార్మికుల సంఖ్య అమాంతం 230కి పైగా చేరింది. రికార్డులలో మాత్రమే అదనంగా వచ్చి చేరిన ఈ 130 మందికి పైగా కార్మికుల పేర్లు ఉంటాయి. వాస్తవానికి క్షేత్రస్థాయిలో వారు కనిపించరు. నిబంధనల మేరకు కార్మికులందరి ఖాతాల్లో వేతనాలు జమవుతాయి. ఇందులో ఖాతాలలో జమ చేసే రూ.13 వేల వేతనంలోంచి బినామీ కార్మికులు రూ.8 వేల చొప్పున కాంట్రాక్టరుకు వెనక్కు తిరిగి ఇచ్చేవారని ఆనాటి కార్మికులు తెలిపారు. ఇలా లక్ష్మీ కళానాయుడు పనిచేసిన మూడేళ్ల కాంట్రాక్ట్ కాలంలో బినామీ కార్మికుల వేతనాల రూపంలో కనీసం రూ.8 కోట్ల మేరకు నిధుల దుర్వినియోగమైనట్లు విశ్వసనీయ సమాచారం.
నీలకంఠాపురం శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా ప్రాజెక్టులో కాంట్రాక్టర్లు నిబంధనలకు పాతరేశారు. దోపిడీకి జై కొట్టారు. అసలైన కార్మికుల కడుపు కొట్టారు. క్షేత్రస్థాయి పనుల్లో కనిపించని కూలీల పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టి ప్రాజెక్టును సొంత జేబు సంస్థగా మార్చుకోవడం చర్చనీయాంశమైంది.


