విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం.. రైతుకు శాపం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం.. రైతుకు శాపం

Sep 20 2026 6:48 AM | Updated on Sep 20 2026 6:48 AM

5 ఎకరాల్లో మిరప పంట తొలగింపు

వజ్రకరూరు: ఆ రైతు ఎన్నో ఆశలతో మిరప పంట సాగు చేశాడు. రూ.లక్షల పెట్టుబడి పెట్టాడు. అయితే విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కరెంటు సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడడంతో పంట ఎండుముఖం పట్టింది. దీంతో చేసేదేమి లేక పంటను తొలగించాడు. వివరాలు.. వజ్రకరూరు మండలం పొట్టిపాడు గ్రామానికి చెందిన రైతు రవీంద్రనాథ్‌రెడ్డి తన ఐదు ఎకరాల్లో మిరప పంట సాగుచేశాడు. ఎకరాకు రూ.1.25 లక్షల దాకా పెట్టుబడి పెట్టాడు. 15 రోజులుగా విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుండడం.. 7 గంటల పాటు రావాల్సిన ఉచిత విద్యుత్‌ రెండు గంటలు మాత్రమే రావడంతో పంట వాడుముఖం పట్టింది. విద్యుత్‌ అధికారులను సంప్రదిస్తే మెయిన్‌ లైన్‌ సమస్య ఉందంటూ చేతులెత్తేశారు. ఇదే క్రమంలో నెలకొన్న వర్షాభావంతో పంట ఎండిపోయే దశకు చేరుకుంది. దీంతో చేసేదేమీ లేక శనివారం రైతు రవీంద్రనాథ్‌ రెడ్డి పంటను తొలగించాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరాడు.

యువకుడి బలవన్మరణం

అనంతపురం సెంట్రల్‌: యువకుడు బలవన్మరణం పొందిన ఘటన అనంతపురంలోని సాయినగర్‌లో జరిగింది. టూటౌన్‌ సీఐ పుల్లయ్య తెలిపిన మేరకు.. సాయినగర్‌కు చెందిన రామ్మూర్తి కుమారుడు భవాని శంకర్‌ (28) అవివాహితుడు. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై శంకర్‌ శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌ సీఐ పుల్లయ్య తెలిపారు.

ట్రాక్టర్‌లో తరలిస్తున్న గడ్డి దగ్ధం

కుందుర్పి: ట్రాక్టర్‌లో తరలిస్తున్న గడ్డి దగ్ధమైన ఘటన కుందుర్పిలో జరిగింది. శెట్టూరు మండలం లక్ష్మంపల్లికి చెందిన రామకృష్ణ శనివారం కణేకల్లు నుంచి ట్రాక్టర్‌లో మొక్కజొన్న గడ్డి తరలిస్తుండగా కుందుర్పిలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ వైర్లు తగిలాయి. ఈ క్రమంలోనే మంటలు చెలరేగడంతో గడ్డి కాలిపోయింది. స్థానికులు స్పందించి మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement