● ట్రాక్టర్‌ను ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్ ● బీటెక్ విద్యార్థి మృతి ● 8 మందికి గాయాలు
తాడిపపత్రి రూరల్: వినాయక నిమజ్జనం విషాదం నింపింది. మండలంలోని ఆలూరు సమీపంలో ట్రాక్టర్‌ను సిమెంట్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. మరో 8 మంది గాయపడ్డారు. అప్‌గ్రెడ్ సీఐ నారాయణరెడ్డి తెలిపిన మేరకు.. పట్టణంలోని సున్నపు గేరికి చెందిన నాగరాజు, పద్మావతి దంపతుల కుమారుడు జగదీష్ (20) స్థానిక సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తన స్నేహితులతో కలిసి శుక్రవారం అర్ధరాత్రి ఆలూరు గ్రామ సమీపంలోని నీటికుంటలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసిన అనంతరం ట్రాక్టర్‌లో తిరుగుపయనయ్యాడు. మార్గమధ్యంలో ఆలూరు వద్ద వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను సిమెంట్ ట్యాంకర్ బలంగా ఢీకొంది. ప్రమాద ధాటికి ట్రాక్టర్ రెండు ముక్కలైంది. ఇంజిన్, ట్రాలీలు రోడ్డు పక్కన బోల్తా పడ్డాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి గాయపడ్డ 9 మందిని 108లో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగదీష్, పవన్, విష్ణువర్దన్, అశోక్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అనంతపురం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ జగదీష్ మృతి చెందాడు. కుమారుడి మృతితో నాగరాజు, పద్మావతి దంపతులు గుండెలవిసేలా రోదించారు. వీరికి మరొక కుమారుడు ఉన్నట్లు తెలిసింది. ప్రమాదానికి కారణమైన తమిళనాడుకు చెందిన డ్రైవర్ మూర్తిపై కేసు నమోదు చేసి సిమెంట్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.


