సోమందేపల్లి (పరిగి): శుభకార్యంలో పాల్గొనడంతో పాటు బంధుమిత్రులతో హాయిగా గడిపి వద్దామని బయలుదేరిన కుటుంబ సభ్యుల ఇళ్లలో విషాదం నిండింది. కారులో వెళ్తుండగా కుక్క అడ్డురావడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో సౌమ్య (46) అనే మహిళ దుర్మరణం చెందిన ఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సమీపంలోని దేవినహళ్లి వద్ద శనివారం జరిగింది. సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన చంద్రశేఖరరెడ్డి కట్టెల మిల్లు యజమాని. ఇతనికి భార్య సౌమ్యతో పాటు కుమార్తె భూమిక, కుమారుడు సంజయ్ శ్రీనివాస్ ఉన్నారు. ఆదివారం బెంగళూరులో తమ సమీప బంధువుల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం ఉదయం చంద్రశేఖరరెడ్డి, సౌమ్య దంపతులతో పాటూ ఆయన కుమారుడు సంజయ్ శ్రీనివాస్, పిన్ని శ్యామలమ్మ, వదిన విమలమ్మతో కలిసి కారులో బయలుదేరి వెళ్లారు. దేవినహళ్లి వద్ద వెళ్తుండగా రోడ్డుకు అడ్డంగా కుక్క అడ్డురావడంతో దాన్ని తప్పించబోయి సడెన్‌గా బ్రేకు వేశాడు. దీంతో ఆగి ఉన్న కారును వెనకవైపు నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఢీకొంది. దీంతో సౌమ్య ప్రయాణిస్తున్న కారు డోరు తెరుచుకుంది. వెంటనే కింద పడిపోయిన సౌమ్య పైనుంచి కారు దూసుకెళ్లింది. ఈ క్రమంలో సౌమ్య దుర్మరణం చెందగా కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి.
సోమందేపల్లిలో విషాదఛాయలు..
బెంగళూరుకు వెళ్లి తిరిగొస్తారని భావించిన కుటుంబ సభ్యులకు, బంధువులకు సౌమ్య విగతజీవిగా తిరిగి రావడంతో సోమందేపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. సౌమ్య భౌతిక కాయాన్ని శనివారం సాయంత్రం స్వగృహానికి తీసుకొచ్చారు. మృతదేహం వద్ద కుటుంబీకులు, బంధువులు గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చూసేందుకు వచ్చిన వారి కళ్లు చెమర్చాయి.
శుభకార్యానికి కారులో వెళ్తుండగా ప్రమాదం


