పట్టణంలో ఆదివారం వినాయక నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం పట్టణంలోని ఏఎంఎస్ ఫంక్షన్ హాలులో బందోబస్తు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. నిమజ్జన ఏర్పాట్లు, పోలీసుల విధులు, శాంతిభద్రతల పరిరక్షణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శోభాయాత్రలో డీజేలు, అధిక శబ్దం, రెచ్చగొట్టే నినాదాలకు తావులేకుండా చూడాలన్నారు. అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనించాలని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా పోస్టులు, వీడియోలు, సందేశాలు ప్రచారం చేసే వారిపై నిఘా ఉంచాలన్నారు. వదంతులు వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ మహేష్, సీఐలు అబ్దుల్ కరీం, ఆంజనేయులు, జనార్దన్, ప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


