విషాదం మిగిల్చిన వేడుక | - | Sakshi
Sakshi News home page

విషాదం మిగిల్చిన వేడుక

Sep 19 2026 8:38 AM | Updated on Sep 19 2026 8:38 AM

ధర్మవరం అర్బన్‌: నిమజ్జనం ఊరేగింపు.. చిన్నా పెద్దా అందరూ వసంతాలు చల్లుకుంటూ ఆడుతూ పాడుతూ జనమంతా ఆనందంగా ఉన్నారు.. నిమజ్జనం పూర్తి కానేలేదు.. అంతలోనే అపరిశ్రుతి చోటు చేసుకుంది. ట్రాక్టర్‌ రూపంలో మృత్యువు కబళించింది.. క్షణాల్లోనే సంబరమంతా ఆవిరైంది. ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలిక ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన ధర్మవరం పట్టణంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు.. ధర్మవరంలోని శారదానగర్‌కు చెందిన ప్రజలు ఆటోలో వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. కదిరి గేటు సమీపంలోని బ్రహ్మంగారి ఆలయం వద్దకు చేరుకోగా... వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనానికి తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌ వెనుక నుంచి వేగంగా వచ్చింది. మద్యం మత్తులో ఉన్న ట్రాక్టర్‌ డ్రైవర్‌ పోతలయ్య రోడ్డు పక్కన ద్విచక్ర వాహనంపై కూర్చున్న నిరీష, నిషితలను ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. వారు కింద పడటంతో నిరీషకు కాలు విరిగింది. స్కూటీ కింద పడిపోయింది. వేగంగా ట్రాక్టర్‌ను పక్కకు తిప్పడంతో అదుపుతప్పి ఎదురుగా ఉన్న ఆటోపైకి ఎక్కింది. ఈ ప్రమాదంలో ఆటోలో వెనుక కూర్చున్న వర్షిత (9) అక్కడికక్కడే మృతిచెందింది. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వర్షిత అక్క బిందుప్రియకు కాలు విరిగింది. మాధవి, బిందుశ్రీలకు తీవ్ర గాయాలయ్యాయి. నితీష్‌, శ్రావ్య, తాజుద్దిన్‌, షర్వీన్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. కళ్లముందే కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు గంగాదేవి, అశోక్‌లు బోరున విలపించారు. చిన్న కూతురు మృతి చెందడం, పెద్ద కూతురుకు కాలు విరగడంతో ఆ తల్లిదండ్రుల రోదన అందరినీ కలచివేసింది. మృతిచెందిన వర్షిత శాంతినగర్‌లోని మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతోంది. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ డ్రైవర్‌ పోతలయ్య పరారీలో ఉన్నాడు. ధర్మవరం వన్‌ టౌన్‌ ఇన్‌చార్జ్‌ సీఐ జయనాయక్‌ ఆస్పత్రికి చేరుకొని క్షతగాత్రుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు.

వినాయక నిమజ్జన ఊరేగింపులో అపశ్రుతి

మద్యం మత్తులో ట్రాక్టర్‌

వేగంగా నడిపిన డ్రైవర్‌

ఆటోను ఢీకొనడంతో బాలిక మృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement