నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

Sep 19 2026 8:38 AM | Updated on Sep 19 2026 8:38 AM

హిందూపురం టౌన్‌: పట్టణంలో ఆదివారం నిర్వహించనున్న వినాయక నిమజ్జన శోభాయాత్రకు పకడ్భందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఏఎస్పీ మహేష్‌ అన్నారు. దాదాపు 1000 మంది పోలీసు సిబ్బంది, అధికారులు బందోబస్తులో పాల్గొంటారన్నారు. వినాయక నిమజ్జన ఏర్పాట్లపై శుక్రవారం ఏఎస్పీ కార్యాలయం వద్ద సీఐలు ప్రసాద్‌, జనార్దన్‌, అబ్దుల్‌ కరీంల కలిసి ఏఎస్పీ విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో సుమారు 150 వినాయక విగ్రహాలతో శోభాయాత్ర ఉంటుందన్నారు. నిక్కంపల్లి, వాల్మీకి సర్కిల్‌, చిన్న మార్కెట్‌, ఎంఎఫ్‌ రోడ్‌, మెయిన్‌బజార్‌, గాంధీ సర్కిల్‌, ఎన్టీఆర్‌ సర్కిల్‌, రైల్వే రోడ్డు, అంబేడ్కర్‌ సర్కిల్‌, గురునాథ్‌ సర్కిల్‌ మీదుగా శోభాయాత్ర సాగి గుడ్డం కోనేరులో విగ్రహాల నిమజ్జనం ఉంటుందన్నారు. 13 అడుగుల వెడల్పు ఉన్న విగ్రహాలను పేట వెంకటరమణస్వామి ఆలయ మార్గంలోకి రానివ్వబోమన్నారు. ఆయా విగ్రహాలన్నీ ఇప్పటికే పోలీసులు చెప్పిన మార్గం గుండా వెళ్లాలన్నారు. నిమజ్జనం రోజు రాత్రి 11 గంటలపైన డీజేలను బంద్‌ చేయాలన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో భద్రతా చర్యలు చేపట్టామన్నారు. శోభాయాత్ర మార్గాల్లో పోలీసులను మోహరించడంతోపాటు రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. శోభాయాత్ర సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేశామన్నారు. ప్రధాన రహదారుల మీదుగా వచ్చే బస్సులు, లారీలు, కార్లు తదితర వాహనాలను పట్టణంలోకి రాకుండా దారి మళ్లిస్తామన్నారు. ముఖ్యంగా బెంగళూరు–అనంతపురం జాతీయ రహదారిపై భారీ వాహనాల రాకపోకలను నియంత్రిస్తామన్నారు. బెంగళూరు నుంచి అనంతపురం వైపు వెళ్లే భారీ వాహనాలపై ఉదయం నుంచే ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తామన్నారు. శోభాయాత్రలో మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోవడంతోపాటు వాహనాన్ని సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. కోనేరు వద్ద రెండు క్రేన్లను మున్సిపల్‌ అధికారులు ఏర్పాటు చేశారని, నిమజ్జన కార్యక్రమాన్ని నిర్ణీత సమయాల్లోనే పూర్తి చేసి పోలీసులకు నిర్వాహకులు, భక్తులు సహకరించాలన్నారు.

భారీ వాహనాలకు

హిందూపురంలో ఆంక్షలు

మద్యం సేవించి వాహనం నడిపితే

సీజ్‌ చేస్తాం

ఏఎస్పీ మహేష్‌ హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement