కదిరి అర్బన్: ఎగువపల్లి సమీపంలో హంద్రీ–నీవా కాలువ పంప్‌హౌస్ వద్ద శుక్రవారం గుర్తు తెలియని శవం లభ్యమైనట్లు కదిరి రూరల్ అప్‌గ్రేడ్ పోలీస్టేషన్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. శవం పురుషుడిదని వయసు సుమారు 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉంటుందన్నారు. పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో గుర్తు పట్టడం కష్టంగా మారిందన్నారు. ఎవరైనా చుట్టు పక్కల గ్రామాల వారు తమ కుటుంబ సభ్యులు తప్పిపోయినట్లు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
విషద్రావకం తాగి వృద్ధురాలు ఆత్మహత్య
బత్తలపల్లి: కాలికి అయిన గాయం శస్త్రచికిత్స చేయించుకున్నా నయం కాకపోవడంతో నొప్పిని భరించలేక ఓ వృద్ధురాలు విషద్రావకం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బత్తలపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. బత్తలపల్లిలోని పాతూరుకు చెందిన తలచూరి కేశమ్మ(75) సంతానం లేదు. తన అన్న కుమారుడైన చంద్రశేఖర్ ఇంట్లోనే ఉంటోంది. ఆమె కాలికు గాయం కావడంతో గతంలో ఆపరేషన్ చేయించారు. గాయం నయంకాకపోగా, నొప్పి ఎక్కువైంది. ఈ విషయమై తన మేనల్లుడు చంద్రశేఖర్, అతని భార్య రమాదేవికి చెప్పింది. వారిద్దరూ వృద్ధురాలికి నచ్చజెప్తూ ఉండేవారు. అయితే గురువారం సాయంత్రం ఇంటివద్ద ఎవరూలేని సమయంలో విషద్రావకం తాగింది. ఇంతలో బయటికెళ్లిన భార్యాభర్తలిద్దరూ ఇంటికి వచ్చి విషయాన్ని గమనించారు. వృద్ధురాలిని ఆరా తీయగా.. తాను విషద్రావకం తాగినట్లు చెప్పడంతో వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు బత్తలపల్లి పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంతో
మహిళా రైతుకు తీవ్ర గాయాలు
గుత్తి రూరల్: మండలంలోని టి.కొత్తపల్లిలో శుక్రవారం విద్యుదాఘాతంతో నాగలక్ష్మి అనే మహిళా రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన ఆదిశేషులు, నాగలక్ష్మి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నాగలక్ష్మి గ్రామ శివారులోని పంటకు నీరు పెట్టేందుకు వెళ్లింది. వ్యవసాయ బోరు స్విచ్ ఆన్ చేస్తున్న క్రమంలో స్టార్టర్ బాక్సు వద్ద తెగి ఉన్న తీగ తగిలి ఆమె షాక్‌కు గురైంది. ఈ ప్రమాదంలో సొమ్మసిల్లి పడి అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్సలకు అనంతపురానికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


