పెనుకొండ రూరల్: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు.. పెనుకొండ పట్టణంలోని నారాయణమ్మ కాలనీకి చెందిన కార్పెంటర్ రామాంజినేయులు (45) బుధవారం సాయంత్రం స్థానికంగా జరిగిన వినాయక నిమజ్జనోత్సవంలో పాల్గొన్నాడు. చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేసిన అనంతరం ట్రాక్టర్‌లో తిరిగి ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలోని మిట్ట ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ట్రాక్టర్ అదుపు తప్పడంతో రామాంజినేయులు కిందిపడ్డాడు. ఈ క్రమంలోనే అతని తలపై ట్రాక్టర్ చక్రం ఎక్కడంతో తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రున్ని హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య అరుణ, కుమార్తె మమత, కుమారుడు రవి ఉన్నట్లు తెలిసింది.
రామాంజినేయులు (ఫైల్)
ట్రాక్టర్ అదుపుతప్పి వ్యక్తి మృత్యువాత


