‘పుర పోరు’కు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

‘పుర పోరు’కు సన్నద్ధం

Sep 17 2026 12:08 AM | Updated on Sep 17 2026 12:08 AM

వార్డుల సంఖ్య పెంచుతూ

సర్కార్‌ గెజిట్‌ విడుదల

పుట్టపర్తి టౌన్‌: ‘పుర’పోరుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ క్రమంలో జిల్లాలోని మున్సిపాలిటీల్లో వార్డులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పాలన సౌలభ్యం కోసం జనాభా అధారంగా వార్డుల సంఖ్య పెంచాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్థానిక మున్సిపల్‌ అధికారులు వార్డుల సంఖ్య పెంచుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అభ్యంతరాలన్నీ పరిష్కరించాక జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే హిందూపురం మున్సిపాలిటీలో 38 వార్డులుండగా.. 52, మడకశిరలో 20 వార్డులుండగా..23, పెనుకొండలో 20 వార్డులుండగా..23కు పెంచారు. తాజాగా పుట్టపర్తి మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా...వాటిని 28కు పెంచారు. అలాగే కదిరి మున్సిపాలిటీలో గతంలో 36 వార్డులుండగా.. 44 వార్డులకు పెంచుతూ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం వార్డుల వారీగా ఓటర్ల విభజన ప్రక్రియలో అధికారులు నిమగ్నమయ్యారు. త్వరలోనే ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. ప్రభుత్వ తాజా చర్యలతో ఏక్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నేటి నుంచి

‘స్వచ్ఛతా హీ సేవ’

ప్రశాంతి నిలయం: జిల్లా వ్యాప్తంగా ఈనెల 17 నుంచి నెల రోజుల పాటు నిర్వహించనున్న ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రచార కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్లు, బస్టాండ్లు, పర్యాటక ప్రాంతాల్లో శుభ్రతా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు, సన్మాన కార్యక్రమాలు, ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణపై అవగాహన కల్పించడం తదితర కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మెప్మా, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

భక్తిని చాటుదాం..

ఆదర్శంగా నిలుద్దాం

ఉత్సవ కమిటీ నిర్వాహకులకు

ఎస్పీ సతీష్‌కుమార్‌ పిలుపు

హిందూపురం టౌన్‌: ‘‘గణేష్‌ నిమజ్జనం సందర్భంగా సంప్రదాయ కళాకారులు, కళారూపాలను ప్రోత్సహిద్దాం...డీజేలను పక్కనపెట్టి భక్తితో గణేశుడిని గంగఒడి చేర్చి ఆదర్శంగా నిలుద్దాం’’ అని ఎస్పీ సతీష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక సాయితేజ ఫంక్షన్‌ హాలులో గణేష్‌ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై పోలీసుల ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, గణేష్‌ ఉత్సవ సమితుల ప్రతినిధులతో ఏఎస్పీ మహేష్‌ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్పీ సతీష్‌ కుమార్‌ మాట్లాడారు. నిమజ్జన వేడుకల్లో ఈసారి డీజేలకు అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా సంప్రదాయ కళాకారులు, కళారూపాలను ప్రోత్సహించాలని సూచించారు. ‘‘పండుగ భక్తిని చాటాలి.. డీజే శబ్ధాన్ని కాదు’’ అనే సందేశంతో యువత సంప్రదాయాలను గౌరవిస్తూ ఉత్సవాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. అలాగే హిందూపురంలో పలు రహదారులు ఇరుకుగా ఉన్నందున భారీ విగ్రహాల నిమజ్జన ఊరేగింపులకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఈ నెల 20న నిమజ్జనం రోజున ప్రతి విగ్రహం సాయంత్రం 5 గంటల్లోపు ప్రధాన రహదారికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అలాగే పోలీసులు సూచించిన రూట్‌ మ్యాప్‌ను అనుసరించాలని, వీలైనంత త్వరగా నిమజ్జనాన్ని పూర్తి చేయాలన్నారు. అనంతరం కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌, సీసీ, డ్రోన్‌ కెమెరాల పనితీరును పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్టీఓ కరుణ సాగర్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున, సీఐలు ఆంజనేయులు, అబ్దుల్‌ కరీం, జనార్దన్‌, ప్రసాద్‌బాబు, ఇస్మాయిల్‌, ఉక్సవ కమిటీల నిర్వాహకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement