గుడిబండ: మడకశిర నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. పాలకులు పట్టించుకోక...అధికారులు స్పందించక గ్రామీణులు గుక్కెడు నీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్లెక్కాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా గుడిబండ మండల పరిధిలోని పి గొల్లహట్టి మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు.
25 రోజులుగా నీరు బంద్
పి గొళ్లహట్టిలో 25 రోజులుగా తాగునీటి సమస్య నెలకొంది. అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. ఎమ్మెల్యేౖకైనా తమ గోడు వెళ్లబోసుకుందామనుకుంటే స్థానికేతరుడైన ఆయన ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు. దీంతో మహిళలు బుధవారం రోడ్డెక్కారు. అధికారులు, ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ ఖాళీ బిందెలతో గుడిబండ – మడకశిర రహదారిపై బైఠాయించారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ గ్రామానికి తాగునీరు అందించేంత వరకూ కదిలేది లేదని రోడ్డుపైనే బైఠాయించారు. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను 2 గంటల పాటు అడ్డుకున్నారు. ఎస్‌ఐ రమేష్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని మండల అధికారులకు వివరించారు. ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తామని అధికారులు చెప్పారని మహిళలకు తెలిపి వారితో ఆందోళన విరమింపజేశారు. అనంతరం మహిళలు స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. తమ గ్రామంలోని తాగునీటి సమస్య వెంటనే పరిష్కరించాలని ఎంపీడీఓ కేశవరెడ్డికి వినతి పత్రం అందించారు. స్పందించిన ఆయన ..వారం రోజుల్లో కొత్తగా బోరు వేయించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని, అంతవరకూ ట్యాంకర్ల ద్వారా అందిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.
25 రోజులుగా పి గొల్లహట్టిలో దాహం కేకలు
పట్టించుకోని అధికారులు,
ప్రజాప్రతినిధులు
రోడ్డుపై బైఠాయించి
నిరసన తెలిపిన మహిళలు
చంద్రబాబు ప్రభుత్వానికి
వ్యతిరేకంగా నినాదాలు


