పుట్టపర్తి: చత్తీస్‌గఢ్‌లో విధులు నిర్వహిస్తూ కొండ ప్రాంతంలో కాలు జారిపడి తీవ్రంగా గాయపడిన జవాన్ సుబ్బిరెడ్డి (50) వారం రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఓడారు. ఆయన మరణవార్త స్థానికంగా విషాదం నింపింది. వివరాలిలా ఉన్నాయి. కొత్తచెరువు మండలం లింగారెడ్డిపల్లికి చెందిన శెట్టిపి చిన్నవెంకటప్ప కుమారుడు శెట్టిపి సుబ్బిరెడ్డి(50) బీఎస్‌ఎఫ్‌లో 31 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఈ నెల 9వ తేదీన చత్తీస్‌గఢ్‌లో కొండ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తూ కాలు జారి పడ్డారు. తోటి జవాన్లు ఆయన్ను 14 కిలోమీటర్లు భుజాలపై మోసుకుని హెలిప్యాడ్‌కు చేర్చి.. అక్కడి నుంచి రాయపూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సుబ్బిరెడ్డి వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి రక్తం ఊపిరితిత్తుల్లోకి చేరడంతో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రాయపూర్‌కు బయలుదేరి వెళ్లారు. ఆయనకు భార్య లీలావతి, కుమారుడు వంశీధర్‌రెడ్డి, కుమార్తె రోహిణి ఉన్నారు.
జవాన్ సుబ్బిరెడ్డి (ఫైల్)


