ప్రశాంతి నిలయం: ప్రశాంతి నిలయంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం ఉదయం సత్యసాయి మహా సమాధి చెంత వేదపఠనంతో వేడుకలు ప్రారంభించారు. సత్యసాయి మహాసమాధిని, సాయికుల్వంత్ సభా మందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. సత్యసాయి విద్యార్థులు గణనాథుడిని కీర్తిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కార్యాలయంలో సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్‌రాజు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయి విద్య, వైద్య, ట్రస్ట్ కార్యాలయాల్లో విభిన్న రూపాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేశారు. పిదప భక్తులు సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు.


