బత్తలపల్లి: కరువు కోరల్లో చిక్కుకున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న పేర్కొన్నారు. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం కరువు బృందం బత్తలపల్లి మండలం గుమ్మల్లకుంట గ్రామంలో పర్యటించింది. ఐదు ఎకరాల్లో 300 చీనీచెట్లు నీరు లేక ఎండిపోయిన వైనాన్ని పరిశీలించి, బాధిత రైతు లక్ష్మీదేవిని నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని చాలా గ్రామాల్లో పండ్లతోటలు ఎండుతున్న దుర్భర పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. వరిమడుగు నాగిరెడ్డి, లక్ష్మీదేవి దంపతులు సాగు చేసిన చీనీ చెట్లు ఎండిపోయాయన్నారు. రెండు ఎకరాలలో ఏడు బోరు బావులు ఉన్నా ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు రాక ఎండిపోయాయన్నారు. దీంతో ఆ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. మూడు ఎకరాలలో పశువుల గడ్డి కూడా ఎండిపోయిందన్నారు. నాగిరెడ్డి, లక్ష్మీదేవి దంపతులకు రూ.30 లక్షల వరకు నష్టం వచ్చిందని, ప్రభుత్వంపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లాను వెంటనే కరువు ప్రాంతంగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మిక సంఘం ధర్మవరం పట్టణ కార్యదర్శి గుంపు హరి, లక్ష్మన్న, రైతులు లక్ష్మీదేవి, నాగిరెడ్డి, హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


