● అందరూ మట్టి వినాయక ప్రతిమలే ప్రతిష్ఠించాలి
● కలెక్టర్ శ్యాం ప్రసాద్ పిలుపు
ప్రశాంతి నిలయం: జిల్లా ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని, సహజ రంగులలో చేసిన మట్టి ప్రతిమలతో పర్యావరణ అనుకూల వినాయక చవితి జరుపుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ అనుకూల వినాయక చవితి ఉత్సవాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ శ్యాం ప్రసాద్ మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు బహూకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వినాయక చవితి విశిష్టతను కాపాడేందుకు అందరూ కృషి చేయాలన్నారు. చెరువులు, జలవనరులకు నష్టం కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వాడకాన్ని నిషేధించాలన్నారు. కార్యక్రమంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ ఇంజినీర్ శశికళ, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
‘పోషణ్ మాహ్’ విజయవంతం చేయండి
జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ‘పోషణ్ మాహ్–2026’ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ శనివారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ప్రోటీన్లతో కూడిన ఆహారం ఎంతో అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ తగినంత ప్రోటీన్‌ను ఆహారంలో తీసుకోవాలని సూచించారు.
వినియోగదారుల
హక్కుల పరిరక్షణే ధ్యేయం
పుట్టపర్తి టౌన్: వస్తువుల కొనుగోలు నుంచి ఆన్‌లైన్ సేవల వరకు వినియోగదారులకు సంపూర్ణ అవగాహన కల్పిస్తూ వారి హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అన్నారు. స్థానిక సాయిఆరామంలో ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల సంఘాల సమాఖ్య (క్యాప్‌కో), జాతీయ వినియోగదారుల సమన్వయ మండలి (సీసీసీ) ఆధ్వర్యంలో చైర్మన్ సురేష్ కుమార్ అధ్యక్షతన 16వ జాతీయ వినియోగదారుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పది రాష్ట్రాల నుంచి విచ్చేసిన జాతీయ వినియోగదారుల సమన్వయ మండలి ప్రతినిధులు జాతీయ స్థాయిలో వినియోగదారుల ఉద్యమాలను బలోపేతం చేయడంపై చర్చించారు. అనంతరం జేసీ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ... జిల్లాలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని, వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో సీసీసీ చైర్మన్ అభిషేక్ శ్రీవాత్సవ్, బ్యూరోఆఫ్ ఇండియన్ స్టాండర్స్ డైరెక్టర్ ప్రేమసంజనీ పట్నాలా, ప్రొఫెసర్ అనిల్ జవహరి, క్యాప్‌కో చైర్మన్ నాగేశ్వరరావు, వ్యవస్థాపకులు కృష్ణారెడ్డి, హైకోర్టు అడ్వకేట్ సునీల్ పాల్గొన్నారు.
9,913 కేసులు పరిష్కారం
అనంతపురం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 9,913 కేసులు పరిష్కారం అయ్యాయి. ఈ కేసుల్లో ఏకంగా రికార్డు స్థాయిలో రూ.10.49 కోట్ల పరిహారం మంజూరు చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు అధ్యక్షతన జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక స్థాయిలో పరిహారం కల్పించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాజీమార్గమే రాజమార్గం‘ అని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.రాజశేఖర్ మాట్లాడారు.


