గణపయ్య..ఆగయా | - | Sakshi
Sakshi News home page

గణపయ్య..ఆగయా

Sep 13 2026 9:16 AM | Updated on Sep 13 2026 9:16 AM

పుట్టపర్తి టౌన్‌: జిల్లా అంతటా వినాయక చవితి సందడి కనిపిస్తోంది. జై బోలో గణేష్‌ మహరాజ్‌ కీ నినాదాలు వినిపిస్తున్నాయి. మంటపాల ఏర్పాటు, అలంకరణ తదితరాలకు సన్నాహాలు ఊపందుకున్నాయి. కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలో పలు చోట్ల రకరకాల ఆకృతుల్లో ఆకర్శణీయమైన విగ్రహాలను సిద్ధం చేశారు. రూ.1,000 నుంచి రూ.50 వేల విలువైన విగ్రహాలను కమిటీ సభ్యులు కొనుగోలు చేశారు.

మట్టి గణపతితో మేలు..

ఉత్సవాలకు మట్టి వినాయకుని ప్రతిమలనే వాడాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని సహజ పద్ధతిలో నిమజ్జనం చేస్తే తిరిగి మట్టిలో కలిసిపోయే అవకాశం ఉంటుందని, తద్వారా పర్యావరణహిత సంప్రదాయాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు చేసే విగ్రహాలు నీటిలో కరగవని, నిమజ్జనం అనంతరం అవశేషాలు పేరుకుపోయి జల వనరుల సహజ స్వభావాన్ని దెబ్బ తీస్తాయంటున్నారు.

నిబంధనలు తప్పనిసరి..

వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీస్‌ శాఖ నుంచి అనుమతులు తప్పనిసరిగా పొందాలి. ఇందుకోసం పోలీసుస్టేషన్లకు రావాల్సిన అవసరం లేదని, ‘గణేష్‌ ఉత్సవ్‌’ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతున్నారు. ప్రతిష్టించే విగ్రహం ఎత్తు, ప్రదేశం, నిమజ్జనం తేదీ తదితర వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. అన్ని శాఖల అధికారులు పరిశీలించిన తరువాత అనుమతులు మంజూరు చేస్తారు. మంటపాలకు ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌ జారీ చేయనున్నారు.

● మంటపాలు ఏర్పాటు చేసే సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించాలి. లౌడ్‌ స్పీకర్లు ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు పరిమితి శబ్దంతోనే ఉపయోగించాలి. మంటపాల వద్ద అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలి. క్యూ లైన్లు, పార్కింగ్‌ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతోపాటు 24 గంటలూ వలంటీర్లను అందుబాటులో ఉంచాలి. విగ్రహాల ఊరేగింపు సమయంలో ఇతరులను రెచ్చకొట్టేలా వ్యవహరించకూడదు.

జిల్లా అంతటా వినాయక చవితి సందడి

వాడవాడలా సిద్ధమవుతున్న మంటపాలు

అనుమతులు తప్పనిసరి

అంటున్న పోలీస్‌ శాఖ

మట్టి గణపతులనే పూజిద్దామంటున్న పర్యావరణ ప్రేమికులు

శాంతిభద్రతలకు

విఘాతం కలిగిస్తే చర్యలు

పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి. మంటపాలకు అనుమతులు తీసుకోవాలి. అనుమతులు పొందిన తర్వాతనే విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి. ఉత్సవాల ముసుగులో ఘర్షణలు, మత కలహాలు, అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. రాత్రి 10 గంటల వరకు మాత్రమే మైకులకు అనుమతి ఉంటుంది. మంటపాల సమీపంలో జూదం ఆడటం, మద్యం తాగడం, అశ్లీల నృత్యాలు వంటి కార్యకలాపాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తాం. బాణాసంచా కాల్చడానికి వీల్లేదు. ప్రతి మంటపం వద్ద క్యూఆర్‌ కోడ్‌ ప్రదర్శించాలి. ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే 112 నంబర్‌కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

– సతీష్‌కుమార్‌, ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement