పావగడ: ఓ వృద్ధురాలు సజీవ దహనమైన ఘటన తాలూకాలోని కేటీ హళ్లి గ్రామంలో జరిగింది. కేటీ హళ్లిలో వృద్ధురాలు సణ్ణ లక్ష్మమ్మ (67) గుడిసెలో నివాసముంటోంది. గురువారం అర్ధరాత్రి అగ్రి ప్రమాదం చోటుచేసుకుని గుడిసె దగ్ధమైంది. ఇంట్లో నిద్రిస్తున్న సణ్ణ లక్ష్మమ్మ మంటల్లో చిక్కుకుపోయి సజీవ దహనమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక దళం మంటలను ఆర్పి గుడిసెలో పరిశీలించగా వృద్ధురాలి శరీరం పూర్తిగా కాలి పోయి గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది. సంఘటనపై అరసికెరె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
విద్యుత్ శాఖ జేఈ అదృశ్యం
కొలిమిగుండ్ల: మండల కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో పని చేసే జేఈ (సబ్ ఇంజినీర్) చింత లక్ష్మణస్వామి అదృశ్యమైనట్లు సీఐ రమేష్‌బాబు శనివారం తెలిపారు. ఆయన స్వస్థలం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం కాగా 14 ఏళ్ల నుంచి జేఈగా విధులు నిర్వహిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి కొలిమిగుండ్లలోనే నివాసం ఉంటున్నారు. ఈ నెల 8వ తేదీ రాత్రి కారు తీసుకుని ప్రమోషన్ ఉందని సంబంధిత పత్రాలు తిరుపతిలో సమర్పించాలని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు నుంచి అతని ఫోన్ స్విచాఫ్ వస్తుంది. కుటుంబ సభ్యులు పలు సార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. బంధువులు, తెలిసిన వాళ్లకు ఫోన్‌లు చేసి ఆరా తీశారు. ఆచూకీ లభించక పోవడంతో చివరకు లక్ష్మణస్వామి భార్య లీలావతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
బేకరీ నిర్వాహకుడిపై
కత్తితో దాడి
ఎన్‌పీకుంట: మండల కేంద్రంలో సాయిబాబా బేకరీ నిర్వాహకుడు లోకేశ్వరరెడ్డిపై అతని సడ్డుకుడు రామాంజులురెడ్డి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన మేరకు.. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం వడిశలంకపల్లికి చెందిన లోకేశ్వరరెడ్డి సడ్డుకుడు రామాంజులురెడ్డి గతంలో ఆర్మీలో విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందాడు. కొంత కాలంగా భార్య సుజాతపై అనుమానంతో వేధింపులకు గురిచేస్తుండటంతో లోకేశ్వరరెడ్డి పలుమార్లు అతనికి నచ్చజెప్పినా ప్రవర్తనలో మార్పు రాలేదు. వేధింపులు భరించలేక అతని భార్య ‘నేను ఇక్కడ ఉండలేను, నన్ను, నా పిల్లలను తీసుకువెళ్లండి’ అని లోకేశ్వరరెడ్డి భార్య హరితకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఆరు నెలల కిత్రం ఆమెను హైదరాబాద్‌లో తమకు తెలిసిన వారి ఇంట్లో పెట్టాడు. భార్య తన నుంచి వెళ్లిపోవడానికి లోకేశ్వరరెడ్డి కారణమని రామాంజులురెడ్డి అప్పటి నుంచి రోజూ గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఎన్‌పీ కుంటలోని బేకరీ వద్దకు వచ్చి గొడవ పడ్డాడు. ‘నేను ఆర్మీ ఉద్యోగి, నిన్ను పొడిచినా నన్ను ఎవరూ ఏమీ చేయలేరు’ అంటూ బెదిరించి వెళ్లాడు. మళ్లీ రాత్రి 8.30 గంటల సమయంలో బేకరీ వద్దకు వచ్చి వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా లోకేశ్వరరెడ్డిపై దాడి చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఎస్‌ఐ క్రిష్ణమూర్తి పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న లోకేశ్వరరెడ్డితో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రామాంజులురెడ్డిని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మద్యం షాపుల
రెన్యూవల్‌కు దరఖాస్తులు
పుట్టపర్తి టౌన్: జిల్లా వ్యాప్తంగా ఓపెన్, రిజర్వ్ కేటగిరీ కింద ప్రభుత్వం మంజూరు చేసిన 78 మద్యం షాపుల నిర్వాహకులు ఈ నెల 21లోపు రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి నరశింహులు తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్, హైబ్రిడ్ పద్ధతుల్లో దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. 2025–26 సంవత్సరం ఫీజులో 38 శాతం ఒకే సారి చెల్లించాలన్నారు. 50 వేల లోపు జనాభా ఉన్న మద్యం షాపులకు రూ. 6,05,000.. 50 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న మద్యం షాపులకు రూ.71,50,000.. 5 లక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్న మద్యం షాపులకు రూ.93,50,000 ఒకే విడతలో లేదా నాలుగు విడతల్లో గానీ చెల్లించాలన్నారు. రెన్యూవల్‌కు వచ్చే లైసెన్స్‌దారుడు ప్రాసెసింగ్ ఫీజు రూ.5,000 డీడీ రూపంలో తీసుకురావాలన్నారు. మరిన్ని వివరాలకు పుట్టపర్తి పట్టణ సమీపంలో ఉజ్వలా ఫౌండేషన్ ఆవరణంలో ఉన్న జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.


