వేతనాలు అందవు.. వెతలు తీరవు | - | Sakshi
Sakshi News home page

వేతనాలు అందవు.. వెతలు తీరవు

Sep 13 2026 9:16 AM | Updated on Sep 13 2026 9:16 AM

శ్రీరామరెడ్డి కార్మికుల ఆకలికేకలు

అనంతపురం న్యూ టౌన్‌: ‘ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారు లు, శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టర్లు మీకు జీవితాలు ఇవ్వకపోతే.. మా సొంత నిధుల నుంచి మీ కు వేతనాలు చెల్లించి ఆదుకుంటాం.. తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరండి.. ప్రజల దాహం తీర్చండి..’ అంటూ కార్మికులకు టీడీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీ ‘నీటి మూటలు’గా నిలిచిపోయింది. సమ్మె విరమించిన తర్వాత జీతాల గురించి ప్రశ్నించిన సుమారు 30 మందిని విధుల నుంచి తొలగించారు.

అవస్థలు వర్ణనాతీతం

నీలకంఠాపురం శ్రీరామరెడ్డి వాటర్‌ సప్లై స్కీం ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పీఏబీఆర్‌, కళ్యాణదుర్గం, రాయదుర్గం, బెళుగుప్ప, పరిగి, హిందూపురం, మడకశిర డివిజన్‌లో 900 పైగా గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. కరోనా సందర్భంలో కూడా తాగునీరు నిరంతరంగా అందించిన ఘనత కార్మికులదే.. ఈ స్కీం లో పనిచేస్తున్న కార్మికులకు మాత్రం సకాలంలో అందని వేతనాలు, నెలల తరబడి జమ కాని ప్రావిడెంట్‌ ఫండ్‌ నిధుల సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ స్కీంలో పనిచేస్తున్న కార్మికులకు కుటుంబ పోషణ భారమైంది. లైన్‌పై పని చేసే లైన్‌మెన్లు, ఫిట్టర్లు, పంప్‌ ఆపరేటర్లు, హెల్పర్లు తదితర కార్మికులకు బండిపై వెళ్లేందుకు పెట్రోలుకు కూడా డబ్బులేక అప్పులు చేస్తున్నారు. పిల్లల చదువులు, కుటుంబ పోషణకు పడరానిపాట్లు పడుతున్నారు.

పె(గ)ద్దలదే రాజ్యం

ఉమ్మడి అనంతపురం జిల్లాలలో 18 ఏళ్ల క్రితం నెలకొల్పిన నీలకంఠాపురం శ్రీరామరెడ్డి వాటర్‌ సప్లై స్కీం పరిశుభ్రమైన తాగునీరు 10 లక్షల మంది ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ఏర్పడింది. ఈ స్కీమును కాలక్రమేణా రాజకీయ పె(గ)ద్దల ప్రమేయంతో భాగాలుగా విడగొట్టారు. కార్మికులు జీతాలు అడిగితే కొత్త అగ్రిమెంటు జరగలేదు. అందువల్ల తాము జీతాలు ఇవ్వలేక పోతున్నామంటూ చెబుతున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచి నిధులు రానందున కార్మికులకు బకాయిలు ఇవ్వలేమని చెబుతున్నారు. అందువల్ల నీలకంఠాపురం శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు తమ డిమాండ్ల సాధనకై సమ్మెలోకి వెళ్తున్నందున తాగునీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు సమ్మె నోటీసులివ్వడం.. వారిని అటు కాంట్రాక్టర్లు.. ఇటు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు నయానో భయానో దారిలోకి తెచ్చుకొని ‘నీటి మూట’ లాంటి హామీలు ఇవ్వడం.. కార్మికులను తిరిగి ప్రాజెక్టులో పనిచేసేలా దారికి తెచ్చుకోవడం పరిపాటి అయిపోయింది.

పండగ పూటా పస్తులే

శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా పథకంలో పనిచేసే కార్మికులు వినాయక చవితి పండుగ పూట కూడా జీతాలందక పస్తులతోనే సహ జీవనం చేయాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. మడకశిర, కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాలలో ప్రశ్నించిన పాపానికి జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడిన కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. మడకశిర ప్రాంతంలో ప్రాజెక్టునే నమ్ముకుని బతుకుతున్న సుబ్బరాజు అనే కార్మికుడు గత జూలై నెలలో తినేందుకు పిడికెడు అన్నం లేక గుడిబండ మండలంలో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ ఎక్కి కిందకు దూకి ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. అతని బాధను సెల్‌ఫోన్‌ ద్వారా విన్న ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ శ్రీనివాసులు ‘తక్షణమే మీ కుటుంబాన్ని ఆదుకుంటాం. ఆత్మహత్యకు పాల్పడవద్దు’ అంటూ ఇచ్చిన హామీ సైతం నెరవేరలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement