లేపాక్షి: స్థానిక పాతూరు ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.చిలమత్తూరు మండలంలోని కొర్లకుంట గ్రామానికి చెందిన పెద్ద తిప్పన్న, అశ్వత్థమ్మ దంపతుల రెండో కుమారుడు శేషాద్రి (23) హిందూపురం పట్టణానికి హమాలీ పని నిమిత్తం ద్విచక్ర వాహనంలో వెళుతుండగా, హిందూపురం నుంచి చిలమత్తూరు వైపు వెళ్తున్న ఓ ట్రాన్స్‌పోర్టు లారీ ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలైన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ నరేంద్ర వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విద్యుదాఘాతంతో పెయింటర్ మృతి
హిందూపురం టౌన్: పెయింటర్ విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఇస్కాన్ ఆలయ నిర్మాణ పనులు జరుగుతుండగా, అందులో కొట్నూరుకు చెందిన నాగార్జున(35) అనే పెయింటర్ పనులు చేస్తున్నాడు. శనివారం పెయింటింగ్ పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. కూప్పకూలిన అతడిని అక్కడున్న వారు హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మరణించినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇస్కాన్ ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటుచేసుకుందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుడి భార్య వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాగార్జున కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కేవీపీఎస్ నాయకులు, పెయింటర్‌లు డిమాండ్ చేశారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ..
హిందూపురం టౌన్: పట్టణంలోని కంసలపేటలో భార్యాభర్తల మధ్య వివాదం విషాదాన్ని మిగిల్చింది. మృతుడి సోదరి భాగ్యలక్ష్మీ తెలిపిన మేరకు.. కంసలపేటకు చెందిన శోభ, దొడ్డబళ్లాపురానికి చెందిన రవికుమార్(40)లు 17 ఏళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. కొంత కాలంగా వీరి మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం కూడా ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన రవికుమార్‌కు ప్రమాదం జరిగిందని, మీరు రావాలంటూ తమకు ఫోన్ చేశారని భాగ్యలక్ష్మీ చెప్పారు. తాము వచ్చి చూడగా రవికుమార్ తీవ్ర గాయాలతో మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని దొడ్డబళ్లాపురం తీసుకెళ్లగా, తమకు అనుమానం రావడంతో తిరిగి హిందూపురానికి తీసుకువచ్చి, పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. రవికుమార్‌ను భార్య శోభనే కొట్టి హత్య చేసిందని టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది. సీఐ అబ్దుల్ కరీం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృత్యువాత
పావగడ: తాలూకాలోని తిరుమణి పీఎస్ పరిధిలోని తిమ్మాపురం గ్రామం వద్ద ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి రామగిరి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన డ్రైవర్ చాకలి హరీశ్ (32) మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు ఎస్‌ఐ విజయ్ కుమార్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


