అగళి: మండల కేంద్రంలోని జాతీయ రహదారి 544 రోడ్డు కూడలి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. గుడిబండ మండలం సింగేపల్లికి చెందిన రంగప్ప (45) కుమార్తె మౌనిక అగళి కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. పండుగ నేపథ్యంలో పాఠశాలకు మూడు రోజులు సెలవులు రావడంతో కుమార్తెను స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు రంగప్ప బైకుపై వచ్చాడు. పాఠశాల నుంచి తండ్రి, కుమార్తె ఇద్దరూ తిరిగి వెళ్తుండగా, మార్గమధ్యంలో మాదుడి రోడ్డు వద్ద రొళ్ల నుంచి కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ బైకును ఢీకొంది. కింద పడిన రంగప్పపై టిప్పర్ టైర్లు ఎక్కడంతో తీవ్ర గాయాలై ఘటనాస్థలిలోనే ప్రాణాలు వదిలాడు. మౌనిక ఎగిరి పక్కకు పడిపోవడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. స్థానికులు ఆమెను పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్సలందించారు. సమాచారం అందుకున్న అగళి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
టిప్పర్ కింద నలిగిన ప్రాణం


