పావగడ: కొన్నేళ్లుగా కనుమరుగైన నక్సల్స్ కార్యకలాపాలు పావగడలో మళ్లీ పురుడుపోసుకుంటున్నాయి. పావగడ తాలూకాలోని కనికలబండ గ్రామంలో ఓ ఇంటి గోడకు అతికించిన నక్సల్ బెదిరింపు లేఖను కలకలం రేపింది. ఈ లేఖను స్థానిక పోలీసులు మూడురోజుల క్రితం స్వాధీనం చేసుకున్నారు. దీంతో పావగడలో మళ్లీ విప్లవ ఉద్యమం ప్రాణం పోసుకుంటోందని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రూ.5 లక్షలు పార్టీఫండ్ ఇవ్వాలి..
నక్సల్స్ అతికించినట్లుగా పేర్కొంటున్న లేఖ ముత్తవకుంట్ల భూషప్పకు కామ్రేడ్ దేవన్న రాసినట్లుగా ఉంది. తాము స్వచ్ఛా సమాజం కోసం తరాలుగా పోరాటాలు చేస్తున్నామని, పేదలపై దోపిడీ, దౌర్జన్యం ఎక్కడ జరుగుతుందో అక్కడ తమ ఉద్యమం పుడుతుందని పేర్కొన్నారు. కనికలబండ గ్రామంలో రాజకీయ గూండాల మధ్య నలిగి పోతున్న ఉప్పర వెంకటేశులు విషయం తమకు తెలిసిందని, అందువల్ల ఆ గూండా శక్తులను అణచి వేయడానికి తమ జనశక్తి పార్టీ తాలూకాలో తిరుగుబాటు చేస్తోందని పేర్కొన్నారు. అందుకుగాను పార్టీకి సహకరించి రూ.5 లక్షలు పార్టీ ఫండుగా ఇవ్వాలని, నకరాలు చేసినా, పోలీసులకు సమాచారం ఇచ్చినా ఉక్కపాదంతో అణచి వేస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 16వ తేదీ (బుధవారం) లోపు డబ్బులు కనికలబండ కురువ చంద్రప్ప కుమారుడు లాయర్ సుబ్రహ్మణ్యంకు అందించాలని, లాయర్‌కు ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా చూసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఈలేఖ స్థానికంగా కలకలం రేపగా, రాష్ట్రస్థాయిలో చర్చ జరుగుతోంది. మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు కూడా దీనిపై దృష్టిసారించి దర్యాప్తు చేపట్టారు.


