జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి

Sep 12 2026 12:18 AM | Updated on Sep 12 2026 12:18 AM

ప్రశాంతి నిలయం: తీవ్ర వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాటమయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు, ప్రజా సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని తెలిపారు. 98 లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి రావాల్సి ఉండగా 34 లక్షల ఎకరాల్లో పంటలే సాగవలేదన్నారు. కంది, టమాట, పత్తి పంటలు ఎండిపోతున్నాయని, వేరుశనగ సాగు భారీగా తగ్గిపోయిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరువు మండలాలు ప్రకటించాలని, ఆహార పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంట బీమా పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. 2026 నాటికి ఉన్న అన్ని పంట రుణాలు మాఫీ చేయాలన్నారు. పంటలు కాపాడేందుకు నీటి రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరించాలన్నారు. ఉపాధి హామీ పనులు విరివిగా కల్పించాలని, రోజుకు రూ.700 వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డీఆర్‌ఓకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కదిరప్ప, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి వినోద్‌, అధ్యక్షుడు బాలస్వామి, కుళ్లాయప్ప, ఈఎస్‌ వెంకటేష్‌, లింగన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement