పుడా.. పోటీ ఎడాపెడా! | - | Sakshi
Sakshi News home page

పుడా.. పోటీ ఎడాపెడా!

Sep 12 2026 12:18 AM | Updated on Sep 12 2026 12:18 AM

సాక్షి, పుట్టపర్తి

పుట్టపర్తి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పుడా).. ఇన్నాళ్లూ కేవలం పుట్టపర్తి నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన ఈ సంస్థ పరిధిలోకి జిల్లాలోని 32 మండలాలనూ చేర్చారు. దీంతో పుడా చైర్మన్‌ పీఠం కోసం పోటీ బాగా పెరిగింది. పైగా రిజర్వేషన్‌ ఉండదు... కుల సమీకరణాలతో పని లేదు... నాయకుడి వద్ద లాబీయింగ్‌ చేసుకుంటే చాలు జిల్లా స్థాయి పదవి సంపాదించవచ్చు. దీంతో పుడా చైర్మన్‌ పీఠం కోసం నెల రోజుల నుంచి భారీ డిమాండ్‌ పెరిగింది. జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రుల వద్ద ఆశావహులు ఎవరికి వారుగా లాబీయింగ్‌ మొదలుపెట్టారు. మాజీ మంత్రుల కుటుంబ సభ్యులు సైతం ‘పుడా’ చైర్మన్‌ పదవి రేసులోకి వచ్చినట్లు తెలిసింది.

పరిధి పెరగడంతోనే పోటాపోటీ..

‘పుడా’ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల వరకు విస్తరించింది. అయితే గత ఆగస్టులో పుడా పరిధిలోకి జిల్లాలోని 32 మండలాలనూ చేర్చారు. అహుడా (అనంతపురం – హిందూపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) అనంతపురం జిల్లాకు మాత్రమే పరిమితం చేశారు. దీంతో పుడా చైర్మన్‌ స్థానం కోసం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఆశావహులు తెరపైకి వచ్చారు. అధిష్టానం వద్ద లాబీయింగ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారనేది చర్చనీయంగా మారింది. హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం నుంచి మూడు పార్టీల్లోనూ ఆశావహుల పేర్లు వినిపిస్తున్నాయి.

ఖాళీగా.. రెండేళ్లుగా..

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ‘పుడా’ చైర్మన్‌ పదవి ఎవరికీ ఇవ్వలేదు. కుల సమీకరణాల్లో భాగంగా ఎవరికి ఇవ్వాలనే దానిపై పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పల్లె రఘునాథరెడ్డి తేల్చలేకపోయారు. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు పూర్తయినా నేటికీ ఎవరికీ ఇవ్వకుండా నాన్చుడు ధోరణితో వచ్చారు. ఒకానొక సమయంలో ప్రొటోకాల్‌ కోసం ‘పుడా’ చైర్మన్‌ పదవి తానే తీసుకుంటానని అనుచరులతో పల్లె ప్రస్తావించినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం పుడా పరిధి పెరగడంతో జిల్లాలోని మిగతా ప్రాంతాల వారికి కూడా అవకాశం ఉన్నందున నియోజకవర్గంలోని నాయకుల ఆశలపై నీళ్లు జల్లినట్లయింది.

రేసులో మాజీ మంత్రి నిమ్మల..

గత సార్వత్రిక ఎన్నికల్లో టికెట్‌ కోల్పోయిన మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప ‘పుడా’ చైర్మన్‌ పదవి ఆశిస్తున్నట్లు తెలిసింది. తనకు ఇవ్వకపోయినా.. కుమారుడికి ఇవ్వాలని అధిష్టానం వద్ద పట్టుబట్టినట్లు సమాచారం. అయితే స్థానిక మంత్రి సవిత, ఎంపీ పార్థసారథి నుంచి నిమ్మల కిష్టప్పకు సహకారం లేదన్న విషయం తెల్సిందే. మరోవైపు పుట్టపర్తి నుంచి సామకోటి ఆదినారాయణ కూడా ‘పుడా’ పీఠం కోసం ప్రయత్నాలు చేస్తుండగా... ఆయన్ను మంత్రి తిరస్కరించినట్లు సమాచారం.

జనసేన నేతల పోరాటం..

ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీజేపీకి ఒక ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. జనసేనకు అహుడా చైర్మన్‌ ఇచ్చారు. అదే తరహాలో ‘పుడా’ చైర్మన్‌ పదవిని కూడా జనసేనకు ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన నుంచి పుట్టపర్తి నేత అబ్దుల్‌ అబు.. చైర్మన్‌ స్థానం కోసం లాబీయింగ్‌ చేస్తున్నట్లు సమాచారం.

జిల్లాలోని 32 మండలాలనూ

‘పుడా’ పరిధిలోకి తెస్తూ సర్కార్‌ నిర్ణయం

చైర్మన్‌ పదవి కోసం పెరిగిన పోటీ... రేసులో అన్ని నియోజకవర్గాల నేతలు

మంత్రులు, ఎమ్మెల్యేలు,

నారా లోకేష్‌తో మంతనాలు

పొత్తులో భాగంగా తమకే ఇవ్వాలని

జనసేన నేతల డిమాండ్‌

టీడీపీ తరఫున మాజీ మంత్రి

నిమ్మల కుటుంబం ఆశలు

కుల సమీకరణల్లో భాగంగా

ఎవరికి వారుగా లాబీయింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement