నేడు లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు లోక్‌ అదాలత్‌

Sep 12 2026 12:18 AM | Updated on Sep 12 2026 12:18 AM

అనంతపురం: జాతీయ లోక్‌ అదాలత్‌ను శనివారం నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు. రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని కోర్టులు, పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని రాజీ పడదగిన కేసులను గుర్తించి, అత్యధిక సంఖ్యలో కేసులను పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

12న జాతీయ

వినియోగదారుల సదస్సు

పుట్టపర్తి టౌన్‌: వినియోగదారుల సమస్యలను చట్టపరంగా ఎదుర్కొనే మార్గాలపై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు పుట్టపర్తిలో ఈనెల 12 నుంచి మూడు రోజుల పాటు 16వ జాతీయ వినియోగదారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు జాతీయ వినియోగదారుల సమన్వయ మండలి అధ్యక్షుడు అభిషేక్‌ శ్రీవాస్తవ్‌, ఆంధ్రప్రదేశ్‌ వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు సురేష్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం వారు స్థానిక సాయి ఆరామంలో విలేకరులతో మాట్లాడారు. సదస్సులో పౌరసరఫరాలు, వినియోగదారుల కమిషనర్‌ కన్నబాబు, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌, జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌తోపాటు సుమారు 18 రాష్ట్రాలకు చెందిన వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, అన్ని జిల్లాలో వినియోగదారులు సంఘాల నాయకులు, కార్యకర్తలు హాజరవుతారన్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షించడంతో పాటు మరింత సమర్థవంతమైన కార్యాచరణ రూపొందించి జాతీయ స్థాయిలో వినియోగదారుల సంఘాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్‌ మోసాలు, నకిలీ, కల్తీ ఉత్పత్తులు, తప్పుదారి పట్టించే ప్రకటనలు, నాసిరకం వస్తువులు, సేవల్లో లోపాలు, డిజిటల్‌ లావాదేవీలతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారని, వీటిపై వినియోగదారులకు అవగాహన కల్పించడంతోపాటు బాధితులకు చట్టపరమైన పరిష్కారం అందేలా వినియోగదారుల సంఘాలు మరింత చురుకై న పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. జాతీయ సదస్సులో వినియోగదారుల పరిరక్షణ చట్టం అమలు, ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలు, డిజిటల్‌ వినియోగదారుల హక్కులు, వినియోగదారులు ఫిర్యాదులు పరిష్కారం వినియోగదారుల సంఘాల బలోపేతం వంటి అంశాలపై చర్చిస్తామన్నారు.

‘ఆశా’ ఉద్యోగాలకు

దరఖాస్తుల ఆహ్వానం

పుట్టపర్తి అర్బన్‌: జిల్లాలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఫైరోజా బేగం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 19, పట్టణ ప్రాంతాల్లో 3 కలిపి మొత్తంగా 22 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు. అర్హులైన మహిళా అభ్యర్థులు ఈనెల 15 నుంచి 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, స్వర్ణ గ్రామ సచివాలయాల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు. దరఖాస్తులు పరిశీలించి ఈనెల 25న తుది జాబితాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. పదో తరగతి ఉత్తీర్ణులై, 25– 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వివాహితులైన మహిళలు అర్హులన్నారు. వితంతువులు, విడాకులు పొందిన, భర్త నుంచి విడిపోయిన, నిరాశ్రయులైన మహిళలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.

‘కేజీబీవీ’ తుది మెరిట్‌ జాబితా విడుదల

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి సంబంధించి తుది మెరిట్‌ జాబితాను శుక్రవారం విడుదల చేశారు. ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా నుంచి రోస్టర్‌ ప్రకారం 1:10 నిష్పత్తిలో అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేశారు. ఆగస్టు 18, 19 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన అభ్యర్థుల తుది మెరిట్‌ జాబితాను http:// samagrashikshaatp. blogspotలో అందుబాటులో ఉంచినట్లు ఏపీసీ శైలజ తెలిపారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులుంటే తగిన ఆధారాలతో ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సమగ్ర శిక్ష కార్యాలయంలో నేరుగా సమర్పించాలని, గడువు అనంతరం అందే అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోబోమని ఏపీసీ శైలజ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement