బత్తలపల్లి: ‘‘తీవ్ర వర్షాభావంతో రైతులంతా సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. రైతులను ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం... దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. హంద్రీ–నీవా కాలువకు సిమెంట్‌తో లైనింగ్ వేసి నీటిని కుప్పానికి తరలించింది. ఇంతకంటే దుర్మార్గమైన పాలకులు ఎక్కడైనా ఉంటారా... జిల్లా రైతులకు ఇంత అన్యాయం జరుగుతున్నా...జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు నోరుమెదపడం లేదు’’ అంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు స్వల్పకాలిక పంటలు సాగు చేసుకోవాలని సూచిస్తున్న ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలోనూ విఫలమైందన్నారు. గురువారం సాయంత్రం ఆయన మండలంలోని గుమ్మల్లకుంట గ్రామంలో వరిమడుగు నాగిరెడ్డి చీనీతోటను పరిశీలించారు. పదేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న చీనీచెట్లు నీరులేక ఎండిపోయాయని రైతు కేతిరెడ్డి ఎదుట వాపోయారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.య.. కూటమి నేతలు రైతుల బాగోగులను పట్టించుకోవడంలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లూ చెరువులకు నీరు విడుదల చేశామని, కూటమి ప్రభుత్వంలో చెరువులకు నీరు విడుదల చేయకపోగా... చెరువులో ఉన్న సంపద కోసం పాకులాడుతూ ఉన్న నీటిని బయటికి పంపేశారన్నారు. ధర్మవరం నియోజకవర్గంలోని ప్రధాన చెరువులు గొట్లూరు, అప్పరాచెరువు, రేగాటిపల్లి చెరువులకు హంద్రీనీవా, పీఏబీఆర్ డ్యాముల నుంచి నీరు విడుదల చేసి చెరువులు నింపితే కనీసం తాగునీరైన ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. చెరువులకు నీరు విడుదల చేయకపోవడంతో... పండ్లతోటలు, ఇతర పంటలు ఎండిపోతున్నాయని, వాటిని చూసి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారన్నారు. అమరావతిలో అద్ధాలకు ఖర్చు చేసే నిధులతో రాష్ట్రంలోని రైతులందరికీ పంటల బీమా ప్రీమియం చెల్లించవచ్చన్నారు. మంత్రి సత్యకుమార్ కేవలం నెలకు రెండు సార్లు నియోజకవర్గంలో పర్యటించి వెళ్లడం తప్ప, ఆయన ప్రజలకు ఎలాంటి మంచి పనులు చేయడంలేదన్నారు. కూటమి నేతలు ఇప్పటికై నా రైతుల ఇక్కట్లను, ఆవేదనను అర్థం చేసుకొని చెరువులకు నీరు విడుదల చేయాలన్నారు. ఎండిపోయిన చీనీ చెట్లను తొలగిస్తూ రైతు నాగిరెడ్డి బోరున విలపించడం తనను కలిచి వేసిందన్నారు. ఇదే పరిస్థితి ఉమ్మడి జిల్లా అంతటా ఉందన్నారు. రైతులకు సాగు నీరు ఇవ్వలేకపోయినా, కనీసం తాగడానికై నా నీరు ఇవ్వాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గజ్జెల వెంగళరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి కమతం ఈశ్వరయ్య, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చల్లా మహేష్ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోటి సురేష్, నియోజకవర్గ నాయకులు షరాబ్ యోగానంద ఆచారి, బండి వీరనారప్ప, బోయ సాంబ, మాజీ సర్పంచులు గొల్లపల్లి నరసింహరెడ్డి, సానే జయచంద్రారెడ్డి, చల్లా కరుణాకర్‌నాయుడు, గోపాల్, అక్కిం దామోదర్, మాదిరెడ్డి చెన్నారెడ్డి, మండల కన్వీనర్ జయరామిరెడ్డి, మాజీ కన్వీనర్ బగ్గిరి బయపరెడ్డి, మండల ఉపాధ్యక్షులు బ్యాల్ల పెద్దయ్య, రాంభూపాల్‌రెడ్డి, జాంపుల చంద్రమోహన్, ఈడిగ కాశప్ప, పోతుల శంకరరెడ్డి, శివారెడ్డి, సీతారాంరెడ్డి, రాజవీరారెడ్డి, ఉపేంద్రరెడ్డి, దివాకరరెడ్డి, సండ్రా రామకృష్ణ, నరేంద్రరెడ్డి, షాషు, నడిమింటి షేక్షావలితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
వర్షాల్లేక రైతులు అల్లాడుతుంటే..హంద్రీ–నీవా నీటిని కుప్పానికి తరలించడం దుర్మార్గం
మండిపడిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
గుమ్మల్లకుంటలో ఎండిన చీనీ తోట పరిశీలన


