ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు ఎన్‌బీఏ గుర్తింపు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు ఎన్‌బీఏ గుర్తింపు పొడిగింపు

Sep 11 2026 11:03 AM | Updated on Sep 11 2026 11:03 AM

ధర్మవరం అర్బన్‌: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌ గుర్తింపు పొడిగించారని ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ సురేష్‌బాబు తెలిపారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ కళాశాలకు ఈ ఏడాది జూన్‌ వరకు ఎన్‌బీఏ గుర్తింపు ఉండేదన్నారు. ఎన్‌బీఏ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవడంతో జూన్‌ 28న ఢిల్లీ నుంచి ఉన్నతాధికారులు పాలిటెక్నిక్‌ కళాశాలను పరిశీలించారన్నారు. తాజాగా కళాశాలకు 2029 డిసెంబర్‌ 31 వరకూ ఎన్‌బీఏ గుర్తింపు పొడిగించారని పేర్కొన్నారు. నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌ గుర్తింపుతో విద్యార్థులకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తుందన్నారు. నాణ్యమైన విద్యను అందించే కళాశాలలకు ఎన్‌బీఏ గుర్తింపు ఇస్తారని తెలియజేశారు.

16 నుంచి డీఎడ్‌ సెమిస్టర్‌ పరీక్షలు

పుట్టపర్తి: డీఎడ్‌ రెండో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 16 నుంచి జరుగుతాయని డైట్‌ కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసులరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19వ తేదీ వరకూ రోజూ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు www. bse. ap. gov. in వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

గంజాయి ముఠా అరెస్ట్‌

1.5 కిలోల గంజాయి స్వాధీనం

ఆత్మకూరు: గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు గురువారం ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలోని హంద్రీ నీవా కెనాల్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనంతపురం రూరల్‌ ఇన్‌చార్జ్‌ డీఎస్సీ చంద్రశేఖర్‌, ఇటుకులపల్లి సీఐ హేమంత్‌కుమార్‌ వివరాలు తెలియజేశారు. వాహనాల తనిఖీలో భాగంగా గురువారం కళ్యాణదుర్గం నుంచి రెండు ద్విచక్ర వాహనాల్లో నలుగురు వ్యక్తులు రాగా అనుమానంతో వారిని తనిఖీ చేశామన్నారు. వారి దగ్గర 1.5 కిలోల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలను, మూడు సెల్‌ఫోన్‌లను స్వాదీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గంజాయి విక్రయిస్తున్న కాకిమాని రాజు, (బళ్లారి టౌన్‌), నల్లబోతుల సుంకన్న (అనంతపురం), ఎడవాల మహేష్‌ (అనంతపురం)తో పాటు బాలుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలియజేశారు. మహేష్‌పై ఇప్పటికే రెండు మర్డర్‌ కేసులు కూడా ఉన్నాయన్నారు. నలుగురిలో ఇద్దరిని కిట్ల ద్వారా పరీక్షించగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు, ఇటుకలపల్లి ఎస్‌ఐలు లక్ష్మణరావు, విజయ్‌కుమార్‌, ఏఎస్‌ఐ దస్తగిరి, గౌస్‌, కానిస్టేబుళ్లు హరి, విజయ్‌, చౌడప్ప, అశోక్‌, హర్ష తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల ఘర్షణ

పెద్దవడుగూరు: గుత్తి పరిధిలోని గేట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో గురువారం విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో గుత్తి అనంతపురం గ్రామానికి చెందిన విజయ్‌కుమార్‌ అనే విద్యార్థికి తీవ్రగాయాలు అయ్యాయి. విషయాన్ని విద్యార్థులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. విజయ్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కళాశాలకు చేరుకొని జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు. యాజమాన్యంతో చర్చించి దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ రాఘవేంద్రప్ప తెలిపారు.

లాటరీ పేరుతో

రూ.15 లక్షల టోకరా!

బొమ్మనహాళ్‌: లాటరీలో భారీ మొత్తం గెలుచుకున్నారంటూ నమ్మించి ఓ వ్యక్తి నుంచి సైబర్‌ నేరగాళ్లు ఏకంగా రూ.15 లక్షలు కాజేసిన ఘటన మండలంలోని కొలగానహాళ్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన మేరకు.. రెండు రోజుల క్రితం కొలగానహాళ్లికి చెందిన నాగరాజుకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేశారు. ‘మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి లాటరీ వచ్చింది.. ఎలక్ట్రికల్‌ స్కూటర్‌తో పాటు పెద్ద మొత్తంలో నగదు గెలుచుకోవచ్చు’ అంటూ మాయమాటలు చెప్పారు. దీంతో నాగరాజు ఆనందంతో ఉబ్బితబ్బియ్యాడు. ‘మీ మొబైల్‌కు ఓటీపీ వచ్చింది, చెప్పండి’ అని సైబర్‌ నేరగాళ్లు కోరగా, వారు చెప్పినట్లే చేశాడు. కొంతసేపటికే అకౌంట్‌లో ఉన్న రూ.15 లక్షలు డ్రా అయినట్లు మెసేజ్‌ రావడంతో ఘొల్లుమన్నాడు. ఈ విషయంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement