ఉరవకొండ/వజ్రకరూరు: కోర్టులో వాయిదా ముగించుకుని తిరిగి స్వగ్రామం వెళ్తున్న ముగ్గురిని మృత్యువు కబళించింది. కొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన వారు విగత జీవులుగా మారడం విషాదం నింపింది. వివరాలు.. వజ్రకరూరు గ్రామానికి చెందిన కణేకల్లు జైనుల్లా (45), మహబూబ్‌బాషా (32), భగవాన్ మహ్మద్‌రఫీ (30)లు గురువారం ఉదయం టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంలో ఉరవకొండ కోర్టుకు కేసు వాయిదా నిమిత్తం వచ్చి సాయంత్రం తిరుగు ప్రయాణయ్యారు. ఉరవకొండ దాటగానే టీవీ టవర్ సమీపంలో ఓ గుర్తు తెలియని వాహనం వీరిని బలంగా ఢీకొంది. వాహనానికి ఇరుక్కున్న ముగ్గురినీ అర కిలోమీటరు వరకు ఈడ్చుకెళ్లడంతో తీవ్ర గాయాలైన వారు అక్కడిక్కడే ప్రాణాలొదిలారు.
దద్దరిల్లిన ఉరవకొండ ఆస్పత్రి..
మృతదేహాలను ఉరవకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి తరలివచ్చారు. వారి రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం దద్దరిల్లింది. ఒకేసారి ముగ్గురి మరణంతో వారి స్వగ్రామం వజ్రకరూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఒక్కగానొక్క కొడుకు..
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహ్మద్‌రఫీ తండ్రి మస్తాన్ కొన్నేళ్ల క్రితమే మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి శర్మాస్‌బీ కూలి పనులకు వెళ్తూ ఇద్దరు కుమార్తెలు, కుమారుడు మహ్మద్‌రఫీని పోషించుకుంటోంది. అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. తనకు ఆధారమైన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో శర్మాస్‌బీ, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘ఒక్కగానొక్క కుమారుడిని తీసుకుని పోయి ఇంటికి మగ దిక్కు లేకుండా చేశావా యా అల్లాహ్’ అంటూ శర్మాస్‌బీ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబం
కణేకల్లు జైనుల్లాకు భార్య వహిదా, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న హోటల్ పెట్టుకుని జైనుల్లా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అలాంటి ఇంటి పెద్ద చనిపోవడంతో కుటుంబం దిక్కులేకుండా పోయింది. ‘యా అల్లాహ్ ఇక నాకు, పిల్లలకు దిక్కెవరు?’ అంటూ వహిదా విలపించడం కలచివేసింది.
మహబూబ్ బాషా భార్య 7 నెలల గర్భిణి..
ఉరవకొండ ఆర్టీసీ డిపోలో అప్రెంటిస్ విధానంలో మెకానిక్‌గా విధులు నిర్వర్తిస్తున్న మహబూబ్‌బాషాకు గుంతకల్లుకు చెందిన ఆశుతో వివాహమైంది. ఇతనికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది. ప్రస్తుతం ఆశు ఏడు నెలల గర్భిణి కావడం గమనార్హం. ఇటీవల ఆమె డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలోనే మహబూబ్‌బాషా మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ‘యా ఖుదా నా కుమారుడిపై ఇంత చిన్నచూపు చూశావా తండ్రీ’ అంటూ మహబూబ్‌బాషా తల్లి రమీజా రోదిస్తుండడం చూసిన పలువురి గుండె బరువెక్కింది.
బైకును ఢీకొన్న
గుర్తు తెలియని వాహనం
ముగ్గురు వ్యక్తుల దుర్మరణం


