అనంతపురం: జిల్లాలో ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈ.భీమారావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని అన్ని స్టేషన్ల పరిధిలో ఉన్న రాజీ పడదగ్గ కేసులను నిర్ధారించి వాటి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో సంఖ్యాపరంగా ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేటట్లు కృషి చేయాలన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఆర్థిక సమస్యలతో యువకుడి ఆత్మహత్య
కనగానపల్లి (చెన్నేకొత్తపల్లి): కుటుంబ ఆర్థిక సమస్యలతో ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చెన్నేకొత్తపల్లి మండలం గొల్లవాళ్లపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు గొల్లవాళ్లపల్లికి చెందిన గొల్ల ప్రసాద్ (36) ధర్మవరంలో సిమెంట్ ఇటుకల ఫ్యాక్టరీ పెట్టుకొని జీవిస్తున్నాడు. అయితే కుటుంబ ఆర్థిక సమస్యలతో మద్యానికి బానిసైన అతను గురువారం ఇంటి దగ్గర ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కాని అతని శరీరం అప్పటికే చాలా కాలిపోయింది. తీవ్ర గాయాలు కావటంతో వెంటనే బెంగుళూరు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
గుడిబండ: మండల పరిధిలోని మందలపల్లికి చెందిన భీమరాజు కుమారుడు జగదీష్ (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. మృతుడు జగదీష్ వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. బుధవారం అర్ధరాత్రి పని నిమిత్తం 544 ఈ జాతీయ రహదారిపై హిందూపురానికి బయలుదేరాడు. అయితే మడకశిర మండలం బుళ్లసముద్రం గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అటుగా వెళుతున్న ప్రయాణికులు గమనించి హుటాహుటిన మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే జగదీష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఆదిలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన గుర్తు తెలియని వాహనం కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.


