పెనుకొండ రూరల్: ‘విజయమే లక్ష్యం కావాలి. ఎవరెన్ని కేసులు పెట్టినా...ఎవరెంత భయపెట్టినా వెనక్కు తగ్గేది లేదు..స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలుద్దాం...గెలిచి చూపిద్దాం’ అంటూ వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బుధవారం పట్టణంలోని ఎన్ కన్వెన్షన్ హాలులో వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు తరలివచ్చారు. ముందుగా దివంగత నేత డాక్టర్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విజయానికి దోహదపడే అంశాలను వైఎస్సార్ సీపీ శ్రేణులకు నేతలు వివరించారు.
విజయఢంకా మోగిద్దాం..
నాయకులు, కార్యకర్తలు అన్న తేడా మరచి అందరం సమష్టిగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయఢంకా మోగిద్దామని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పిలుపునిచ్చారు. నాయకులు క్షేత్రస్థాయిలో కేడర్‌కు భరోసా ఇవ్వాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో స్పష్టత ఉండాలన్నారు. పార్టీ కోసం చేసిన సేవలు, వ్యక్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అధికార పార్టీ నేతలు బనాయించే అక్రమ కేసులను పార్టీ సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా నిలబడుతుందన్నారు. సమావేశంలో పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు రమేష్ రెడ్డి, పెనుకొండ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకురాలు మధుమతి, మాజీ మంత్రి నర్సేగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు వైటీ ప్రభాకర్ రెడ్డి, తిప్పేస్వామి, అత్తార్ చాంద్ బాషా, పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్ర భాస్కర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, వక్కలిగ సాధికారిత విభాగం అధ్యక్షుడు రంగేగౌడ్, అనుబంధ విభాగాల నాయకులు, కన్వీనర్లు పాల్గొన్నారు.
పోస్టర్ల ఆవిష్కరణ
చంద్రబాబు రెండేళ్ల పాలనపై పార్టీ రూపొందించిన వెన్నుపోటు పార్టీ...వెన్నుపోటు పాలన’ పోస్టర్లను పార్టీ నేతలు ఆవిష్కరించారు. అనంతరం మిథున్‌రెడ్డి పార్టీ ముఖ్యనేతలకు పార్టీ ఐడీ కార్డులు అందజేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో
విజయ ఢంకా మోగిద్దాం
పార్టీ శ్రేణులకు
ఎంపీ మిథున్ రెడ్డి దిశానిర్దేశం
అరాచకపాలనకు
చరమగీతం పాడుదామని పిలుపు
ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా
ఉంటుందని వెల్లడి
పెనుకొండలో వైఎస్సార్‌ీసీపీ
జిల్లా విస్తృత స్థాయి సమావేశం


